నాలుగు రాష్ట్రాల్లో 32 చోట్ల ఎన్‌ఐఏ దాడులు!

జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసు బలగాల సమన్వయంతో అధికారుల బృందాలు సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
హర్యానాలోని ఝజ్జర్, సోనిపట్‌లోనూ జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి చెందిన రహస్య స్థావరాలపై దాడులు చేసి ఈ నెల 6న ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. ఈ క్రమంలోనే మరోసారి దాడులు చేపట్టింది. 
 
చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం 1967లోని నిబంధనల ప్రకారం హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్‌ఐఏ బృందాలు సమన్వయంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉగ్రవాద ముఠా నాయకుడు వికాస్ సింగ్‌కు చెందిన ఫ్లాట్-77/4, అస్రే-1, సులభ్ ఆవాస్ యోజన, సెక్టార్-1, గోమతి నగర్ ఎక్స్‌టెన్షన్, లక్నో ఉత్తరప్రదేశ్‌తో సహా ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం.
 
 పంజాబ్‌లోని ఫజిల్కాలోని బిషన్‌పురా గ్రామంలో నిందితుడు దలీప్ కుమార్ అలియాస్ భోలా అలియాస్ దలీప్ బిష్ణోయ్‌కు చెందిన మరో రెండు ఆస్తులు సైతం అటాచ్‌ చేశారు. హర్యానాలోని యమునానగర్‌కు చెందిన జోగిందర్ సింగ్ పేరుతో రిజిస్టర్ అయిన ఫార్చూనర్ కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. 
పంజాబ్ పోలీసు ప్రధాన కార్యాలయంపై గ్రెనేడ్ దాడిలో పాల్గొన్న నిందితులతో సహా ఉగ్రవాదులకు లారెన్స్ బిష్ణోయ్‌ సహచుడు వికాస్ సింగ్ ఆశ్రయం కల్పించాడు. జోగీందర్ సింగ్ తన ఫార్చూనర్ కారును ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రవాణా చేయడానికి చేస్తూ ముఠా సభ్యులకు సహాయం సహాయం అందిస్తున్నట్లుగా గుర్తించారు. 
 
ఆగస్ట్ 2022లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌నేరాలపై ఎన్‌ఐఏ ఉపా యాక్ట్‌ కింద కేసు నమోదు చేసింది. ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో మాఫియా తరహా క్రిమినల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని ఏజెన్సీ విచారణలో వెల్లడైంది. ఈ నెట్‌వర్క్‌లు ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పాటు పలువురి హత్య, దోపిడీలకు పాల్పడ్డాయి. 
 
పాకిస్థాన్, కెనడా సహా విదేశాల నుంచి, భారత్‌లోని జైళ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థల నేతలు చాలా వరకు కుట్రలు పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆయా త్రీవాద, మాఫియా నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఇటీవల ఎన్‌ఐఏ పెద్ద ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు జప్తు చేస్తున్నది.