దేశ విదేశాల నుంచి అయోధ్యకు పెద్ద ఎత్తున బహుమతులు

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తం సమీపిస్తున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులను తీసుకొస్తున్నారు. వాటిని రామాలయంలో ఉపయోగించాలని ఆకాంక్షిస్తున్నారు. 
 
శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి 3,000కుపైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి వీటిలో ఉన్నాయి. శ్రీలంక ప్రతినిధి బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది. 
 
గుజరాత్‌లోని వడోదర నివాసి విహా భర్వాడ్‌ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల అగరుబత్తీని తయారు చేశారు. దీని బరువు 3,610 కేజీలు ఉన్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజస్తంభం, మరో ఆరు చిన్న ధ్వజ స్తంభాలను తీసుకుని ఓ బృందం గత వారం బయల్దేరింది.
 
అతిధులకు కానుకలు

11 వేల మంది అతిథులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది. రామ మందిరాన్ని నిర్మించిన కూలీలు కుటుంబ సభ్యులతో హాజరవుతారని ట్రస్ట్ ప్రకటనలో తెలిపింది. అయోధ్యకు వచ్చే అతిథులకు12వ తేదీ శుక్రవారం నుంచి సనాతన్ సేవా న్యాస్ కానుకలను అందజేయనుంది.  రెండు బాక్సుల్లో కానుకలు ఉంటాయి. ఒకదానిలో ప్రసాదం, బేసన్ లడ్డు, తులసీ ఆకులు ఉంటాయి. 

మరో బాక్స్‌లో రామాలయ నిర్మాణ సమయంలో తీసిన మట్టి, సరయు నదీ నీరు, మెమోంటో ఉంచారు. ఇత్తడి ప్లేట్, వెండి నాణెం కూడా ఉన్నాయి. రెండు గిప్ట్స్ బాక్సులను ఒక బ్యాగులో ఉంచారు. శ్రీరాముడిని దర్శించుకున్న తర్వాత అతిథులకు కానుకలను అందజేస్తారు. అయోధ్యకు భారీగా భక్తుల రావడంతో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది.

జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్‌పీ ఓ ప్రకటనలో తెలిపింది. 96 ఏండ్ల అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వీహెచ్ పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ చెప్పారు.