ఇజ్రాయిల్‌, పాలస్తీనా నేతలతో భారత్ సంప్రదింపులు

ఇజ్రాయిల్‌, పాలస్తీనా నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంటూ కేవలం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది.  ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం చిన్నారులు, మహిళలు సహా పెద్ద ఎత్తున పౌరుల మృతికి కారణమైందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ యుద్ధం భయంకరమైన మానవతా సంక్షోభానికి దారితీసిందని చెబుతూ పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై జరిగిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు.

 ”ఇజ్రాయిల్‌, పాలస్తీనా నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఈ సంక్షోభం మొదలైనప్పటి నుండి భారత్‌ చెబుతోంది. శాంతియుత, సుస్థిర పరిష్కార సాధనకు కట్టుబడి ఉన్నాం. రెండు దేశాల పరిష్కార మార్గాన్ని బలంగా నమ్ముతున్నాం. అర్థవంతమైన చర్చల ద్వారానే ఇది సాధ్యం” అని భారత ప్రతినిధి తెలిపారు. 

దీనికోసం ఇరు దేశాలు కృషి చేయాలని, హింసను విడిచిపెట్టాలని, ప్రత్యక్ష శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించే పరిస్థితులను కల్పించే దిశగా కృషి చేయాలని భారత్‌ కోరుకుంటోందని అనే చెప్పారు. ”అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌లో జరిగిన ఉగ్రదాడులు దిగ్భ్రాంతికరమైనవి. దాడులను ఖండిస్తున్నాం. ఉగ్రవాదాన్ని సహించని విధానాన్ని భారత్‌ అనుసరిస్తోంది. బందీలుగా ఉన్నవారిని తక్షణమే షరతులు లేకుండా విడుదల చేయాలని భారత్‌ డిమాండ్‌ చేస్తుంది ” అని భారత దేశ విధానాన్ని వెల్లడించారు.

”సంక్షోభ ప్రభావిత ప్రజలకు మేం సాయాన్ని కొనసాగిస్తాం. భద్రతా మండలి చేసిన 2720 తీర్మానం మానవీయ సాయాన్ని బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాం. ఇప్పటికే భారత్‌ 70 టన్నుల సామగ్రిని పాలస్తీనా ప్రజలకు అందించింది. వీటిల్లో 16.5 టన్నుల ఔషధాలు, వైద్య పరికరాలున్నాయి” అని  రుచిరా కాంబోజ్‌ తెలిపారు. 

పాలస్తీనా శరణార్థుల కోసం యుఎన్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజన్సీ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ)కి డిసెంబర్‌లో అందించిన 2.5 మిలియన్‌ డాలర్లు సహా భారత్‌ ఐదు మిలియన్‌ డాలర్లను కూడా అందించిందని ఆమె చెప్పారు. పాలస్తీనా శరణార్థులకు ఐక్యరాజ్యసమితి అందించే సేవలకు భారత్ మద్దతు కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు.