
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసుల గురించి చంద్రబాబు ఎక్కడా మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు షరతులు విధించింది.
లిక్కర్, ఐఆర్ఆర్, ఇసుక వ్యవహారాల్లో అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగియగా, తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
తాజాగా బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌లకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రోడ్ల అలైన్ మెంట్ మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా కేసు నమోదు చేసింది.
దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఈ ఏడాది సెప్టెంబరులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ సర్టిఫికెట్లపై జగన్ బొమ్మపై నోటీసులు
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బలకోటయ్య హైకోర్టులో ఫిటిషన్ వేశారు. బుధవారం విచారణ జరపగా కుల, నివాస, ఆదాయ సర్టిఫికెట్లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.
ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లపై కేవలం జాతీయ చిహ్నం, లేదా రాష్ట్రానికి సంబంధించిన ఎంబ్లమ్ మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని, సర్టిఫికెట్లు తీసుకునే ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డ్ సచివాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి కేసు విచారణ వాయిదా వేసింది.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్