ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు.
రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాలోన్ని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో టీటీడీ నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.

More Stories
కాశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖలపై రాష్ట్రపతికి బహిరంగ లేఖ
రహస్యంగా ‘డార్క్ షిప్’ ద్వారా రష్యాకు భారత ఇంధనం
దీర్ఘకాలిక యురేనియం సరఫరాకు భారత్, ఉజ్బెకిస్థాన్ అంగీకారం