కృష్ణా గోదావరి బేసిన్‌లో ముడి చమురు ఉత్పత్తి షురూ

 
*  స్వావలంభన మిషన్‌కు ప్రోత్సాహం.. ప్రధాని మోదీ 
 
కృష్ణా గోదావరి బేసిన్‌లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. బంగాళాఖాతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కేజీ డీ డబ్ల్యూఎస్‌ 98/2 బ్లాక్‌లో తొలిసారిగా ఆదివారం చమురు ఉత్పత్తి జరిగినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
 
కృష్ణా గోదావరి బేసిన్‌లో ముడి చమురు ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు కీలకమైన ముందడుగు అని దేశ స్వావలంభన మిషన్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్న ఆయన దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భరోసా వ్యక్తం చేశారు. 
బంగాళాఖాతం తీరంలో లోతైన నీటిలో ఉన్న కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2 బ్లాక్‌ నుంచి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించామని కాకినాడ ఒఎన్‌జిసి ఈస్టర్న్‌ ఆఫ్‌షోర్‌ అసెట్‌ అసెట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రత్నేష్‌కుమార్‌ తెలిపారు.  కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2లో ఉత్పత్తి అవుతున్న ఆయిల్‌తో ఒఎన్‌జిసి మొత్తం ఆయిల్‌ ఉత్పత్తి 11 శాతం నుంచి 15 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
వివిధ సాంకేతిక, కరోనా సంబంధిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రాజెక్ట్‌ మొదటి దశను మార్చి 2020లో విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. 
ఈ బ్లాక్‌లోని ‘యు’ ఫీల్డ్‌ నుంచి పది నెలల రికార్డు సమయంలో గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించామని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 7న ఈ ఫస్ట్‌ ఆయిల్‌ ప్రారంభించడంతో ఫేజ్‌-2 ముగింపు దశకు చేరుకుందని తెలిపారు.
మరోవైపు ‘ఎం’ ఫీల్డ్‌ నుంచి ఆయిల్‌ ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ ఫీల్డ్‌ అభివృద్ధిలో ముడి చమురు మైనపు స్వభావం వల్ల ఒఎన్‌జిసి అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు.  వాటిని అధిగమించడానికి ఒఎన్‌జిసి దేశంలోనే మొదటిసారిగా పైప్‌ టెక్నాలజీలో వినూత్నమైన పైప్‌ను ఉపయోగించిందని తెలిపారు. ఈ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించిన సబ్‌-సి హార్డ్‌వేర్‌లను అంతర్జాతీయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. 
 
కానీ, మెజారిటీ ఫ్యాబ్రికేషన్‌ పనులు కట్టుపల్లిలోని మాడ్యులర్‌ ఫ్యాబ్రికేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో జరిగాయని తెలిపారు. ఇది మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించడానికి ఒఎన్‌జిసి నిబద్ధతను తెలియజేస్తోందని చెప్పారు. మనదేశ స్వావలంబన శక్తికి దోహదం చేస్తుందని వివరించారు. ఈ ఫీల్డ్‌లో గరిష్టంగా రోజుకు 45 వేల బారెల్స్‌ ఆయిల్‌, పది ఎంఎంఎస్‌సిఎండిలకంటే ఎక్కువగా గ్యాస్‌ ఉత్పత్తి ఉంటుందని చెప్పారు.
 
ఓఎన్‌జీసీకి అనుబంధంగా మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌కు ముడి చమురును పంపనున్నారు. అక్కడ ముడి చమురు నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్‌ నిర్ణయిస్తారు. ప్రస్తుతం చమురువు వెలికి తీస్తున్న కృష్ణా గోదావరి బేసిన్‌ ప్రాజెక్టు బంగాళాఖాతం డెల్టా భాగం, ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక జలాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాజెక్టును మూడు క్లస్టర్లుగా విభజించారు. ప్రస్తుతం క్లస్టర్‌-2లో చమురు ఉత్పత్తిని ప్రారంభించారు.