కర్ణాటక కాంగ్రెస్‌లో ఉపముఖ్యమంత్రుల పదవులకై చిచ్చు

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమతమ వర్గాల ఆధిపత్యం కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఒకరి ఒకరు చెక్‌ పెట్టుకొనేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. 
 
డీకే శివకుమార్‌పై నమోదైన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణకు అనుమతి నిరాకరిస్తూ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి వర్గీయులకు మింగుడు పడటం లేదు. మరి కొందరిని ఉపముఖ్యమంత్రులుగా నియమించడం ద్వారా పార్టీలో, ప్రభుత్వంలో శివకుమార్ ఆధిపత్యంకు గండి పెట్టాలనే ప్రయత్నాలు బహిరంగంగానే జరుగుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు జరిగిన విందు కార్యక్రమం పార్టీలో నిరువుగప్పినా కుమ్ములాటలు బహిర్గతం చేశాయి. ఈ సమావేశానికి దళిత, వెనుకబడిన వర్గాల్లోని బలమైన నేతలైన మంత్రులు జీ పరమేశ్వర, సతీశ్‌ జార్కిహోళి, కేఎన్‌ రాజన్న, హెచ్‌సీ మహదేవప్ప, కేహెచ్‌ మునియప్ప తదితరులు హాజరయ్యారు.
 
జార్కిహోళి నివాసంలో జరిగిన ఈ విందు అనంతరం పలువురు మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా కనీసం మూడు ఉప ముఖ్యమంత్రి  పదవులు ఏర్పాటుచేయాలని అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు. మరిన్ని ఉపముఖ్యమంత్రి పోస్టులను సృష్టించటంలో తప్పులేదని సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహిడుతు, దళిత నేత మహదేవప్ప తెలిపారు.
 
సామాజికవర్గం ప్రాతిపదికగా కాకుండా ప్రజల్లో బలం, పార్టీలో సీనియార్టీని బట్టి ఆ పదవులు ఇవ్వాలని సూచించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడను ఓడించిన ప్రస్తుత మంత్రి కేఎన్‌ రాజన్న కూడా భిన్న సామాజికవర్గాల నేతలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌కు సూచించారు. 
 
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే మంత్రులు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవంక, సిద్ధరామయ్య వ్యూహానికి డీకే శివకుమార్‌ ప్రతివ్యూహం పన్నుతున్నట్టు సమాచారం. 
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 15 ఎంపీ స్థానాలు గెలిపించటం ద్వారా ముఖ్యమంత్రి పదవికి మరింత దగ్గర కావాలని భావిస్తున్నట్టు తెలిసింది. తన ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచవచ్చని ఆయన భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవంక, కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ చూస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఓడించటమే తమ లక్ష్యమని మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల ప్రకటించారు.  బీజేపీతో సీట్ల సర్దుబాటు అంశం ప్రధానం కాదని, కాంగ్రెస్‌ను మట్టికరిపించటమే ముఖ్యమని పేర్కొన్నారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.