లోక్‌సభ ఎన్నికల్లో టిడిపికి అభ్యర్థులే లేరన్న కేశినేని శ్వేత 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులే లేరని, వాటిపై దృష్టి పెట్టకుండా తమ కుటుంబాన్ని వేధించడానికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నేనే కుమార్తె, విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత టిడిపి నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
 
వచ్చే ఎన్నికలలో తిరిగి పార్టీ సీట్ ఇవ్వడం లేదని టిడిపి నాయకత్వం స్ఫష్టం చేయడంతో పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు  కేశినేని నాని ప్రకటించిన మూడు రోజులకే శ్వేత తన పదవికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు.  సోమవారం ఉదయం విజయవాడ కార్పొరేషన్ కు వెళ్లిన శ్వేత అక్కడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా తన రాజీనామా లేఖను సమర్పించారు. 
 
అంతకుముందు విజయవాడ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో శ్వేత భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.  ముందుగా ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు తెలియజేయాలనే ఉద్దేశంతో కలిశానని ఆమె చెప్పారు. కాగా, కూతురు రాజీనామా విషయాన్ని ఎంపీ కేశినేని నాని ముందుగానే వెల్లడిస్తూ సోమవారం ఉదయం ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.
 
రాజీనామా అనంతరం మాట్లాడుతూ  సిట్టింగ్ ఎంపీ అయిన తన తండ్రి కేశినేని నానిని అవమానించారని పార్టీ నాయకత్వంపై ధ్వజమెత్తారు.  విజయవాడ చుట్టుపక్కల ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీలో ఉందని ఆమె చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ సారి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారామె. 
 
రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలకు టిడిపికి అభ్యర్థులే లేరని ఆమె స్పష్టం చేశారు.  ఇవన్నీ వదిలేసి విజయవాడ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోన్నారని శ్వేత ప్రశ్నించారు. సంవత్సర కాలంగా చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ తమ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికీ పిలవకుండా అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తిరువూరు సభ నిర్వహణ విషయంలో కేశినేని నాని ఎందుకు జోక్యం చేసుకుంటోన్నాడంటూ స్వయంగా నారా లోకేష్ ప్రశ్నించాడని పేర్కొంటూ ఒక సిట్టింగ్ ఎంపీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఆమె నిలదీశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది తమ అభిమానులు, అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని శ్వేత తెలిపారు.
 
ఇప్పటికే త్వరలో లోక్ సభ స్పీకర్ ను కలసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కేశినేని నాని స్వతంత్రంగా కూడా పోటీచేసి, గెలుపొందగల సత్తా తనకు ఉన్నట్లు ప్రకటించారు. ప్రయాణంకు ఒక విమానం తప్పిపోతే మరో విమానం దొరుకుతుందంటూ నర్మగర్భంగా అధికార పక్షం వైసిపి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.