గుజరాత్ లో రూ. 2 లక్షల కోట్ల అదానీ పెట్టుబడులు

* రిలయన్స్ ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ
 
గుజరాత్ లో రానున్న ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రకటించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10 ఎడిషన్ లో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పాల్గొంటూ ఈ పెట్టుబడుల వల్ల లక్ష ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
అంతరిక్షం నుంచి కూడా కనిపించే గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మించేందుకు గుజరాత్ లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు.
గత సదస్సులో ప్రకటించిన రూ. 55,000 కోట్లలో అదానీ గ్రూప్ ఇప్పటికే రూ.50,000 కోట్ల పెట్టుబడులు పెట్టినదని ఆయన వెల్లడించారు. ఆదానీ గ్రూప్ ఇప్పుడు కచ్ లో 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోందని, ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుందని అదానీ చెప్పారు.
2014 నుంచి భారత్ జీడీపీలో 185 శాతం వృద్ధిని, తలసరి ఆదాయంలో 165 శాతం వృద్ధిని సాధించిందని పేర్కొంటూ భౌగోళిక రాజకీయ, కొరోనా సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ ఈ ఘనతను సాధించిందని ఆయన కొనియాడారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి మ‌న‌ది అభివృద్ధి దేశంగా మారుతుంద‌ని పేర్కొంటూ ప్ర‌పంచ ప‌ఠంపై భార‌త్‌ను శ‌క్తివంత‌మైన దేశంగా నిలిపార‌ని, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను రూపొందిస్తున్న‌ట్లు అదానీ మెచ్చుకున్నారు.
మరోవైపు, తమ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ హజీరాలో భారతదేశపు మొట్టమొదటి, ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే ఉంటుందని అంబానీ ఆయన స్పష్టం చేశారు. 

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా రిలయన్స్ 150 బిలియన్ డాలర్లు (రూ. 12 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టగా, అందులో మూడింట ఒక వంతుకు పైగా ఒక్క గుజరాత్ లోనే పెట్టుబడులు పెట్టినట్లు అంబానీ వెల్లడించారు. హరిత వృద్ధిలో గుజరాత్ ను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు తమ సంస్థ దోహదం చేస్తుందని రిలయన్స్ అధిపతి తెలిపారు.

గుజరాత్ లోని జామ్ నగర్ లో 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ను రిలయన్స్ నిర్మించడం ప్రారంభించిందని అంబానీ తెలిపారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో గ్రీన్ జాబ్స్ లభిస్తాయని, గ్రీన్ ప్రొడక్ట్స్, మెటీరియల్ ఉత్పత్తికి వీలవుతుందని, తద్వారా రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు.  2024 ద్వితీయార్థంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకరావడానికి కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ వివరించారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధనాల ద్వారా సగం ఇంధన అవసరాలను తీర్చాలన్న గుజరాత్ లక్ష్యానికి తాము సహకరిస్తామని చెప్పారు.