కబ్జా నుంచి బాలికల కళాశాల స్థలం కాపాడండి

కబ్జాదారుల నుంచి తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల స్థలం కాపాడాలని తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష విజ్ఞప్తి చేశారు. తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్  అధ్యక్షుడు హేమంత్ రాయల్, వెంకటేష్ లతో కలిసి సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన స్పందనలో డీఆర్వో  పెంచల కిషోర్ కు ఫిర్యాదు చేశారు.

శ్రీకాళహస్తి పట్టణ శివారులో ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోనే శ్రీ విద్యా ప్రకాశానంద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయగా, ఈ కళాశాల కోసం ప్రభుత్వం అయ్యలనాడు చెరువు పరిధిలో 6.67 ఎకరాలను 1996లో కేటాయించగా, అక్కడ కళాశాలను నిర్మించారని తెలిపారు.  ఇక్కడ నాబార్డు నిధులతో కొత్త భవనాలు కూడా నిర్మించారని, ఈ కళాశాలలో ప్రస్తుతం సుమారు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వీరంతా ఎక్కువ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారని ఆమె చెప్పారు. 

కళాశాల స్థలంలో గతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ఆగ్రహించిన విద్యార్ధినులు వాటిని కూల్చేశారని, అప్పట్లో కబ్జాదారులు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకరపై అక్రమ కేసులు కూడా పెట్టారని పేర్కొన్నారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో అనగా 2018లో ఈ కళాశాల స్థలం కబ్జాకు గురి కాకుండా ఉండటానికి ప్రహారీ నిర్మాణం కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయించారని, అప్పట్లో ప్రహారీ నిర్మాణ పనులు కూడా చేపట్టారని పేర్కొన్నారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో కొందరు నేతలు ఈ పనులు ఆపించేశారని ఆమె ఆరోపించారు. 

ప్రస్తుతం కొందరు నాయకుల పేర్లు చెప్పి దర్జాగా కబ్జా చేసుకోడం పరిపాటిగా మారిపోయిందని ఆమె తెలిపారు. మరికొందరు ఈ స్థలంలో రాత్రికి రాత్రే నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని ఇల్లుగా మార్చుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 

తాజాగా కళాశాల ప్రాంగణంలో కొందరు కబ్జారాయుళ్లు స్థలాన్ని చదును చేయడంతో ప్రిన్సిపాల్ సుధాకర్ రెవెన్యూ, పోలీసు అధికారులకు పిర్యాదుచేసినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉష తెలిపారు. స్థల రక్షణకు ప్రహారీ నిర్మించాలని ఆమె కోరారు. అధికారులు స్పందించి    ఆక్రమణకు గురైన కళాశాల స్థలం కాపాడాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.