అయోధ్యలో భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు

మరో రెండు వారాల్లోనే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, అంతకు ముందే హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. 
 
‘అయోధ్య నగరానికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. మేము వాటర్‌వేస్ సేవలను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం.. .విమానాశ్రయ సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.’ అని చెప్పారు. అలాగే, ప్రారంభోత్సవ వేడుకలను తిలకించేందుకు నగరానికి తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 
 
నగరానికి సందర్శకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగనున్న దృష్ట్యా రైల్వేల సామర్థ్యాన్ని కూడా పెంచుతామని చెప్పారు.  అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. గర్బాలయంలో బాల రాముడి విగ్రహాన్ని జనవరి 22న ప్రతిష్ఠిస్తారు.
డిసెంబరు 30న అయోధ్యలో విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు.

రామమందిర్‌ థీమ్‌ చీరలకు గిరాకీ

మరోవంక, ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో రామ మందిర్‌ థీమ్‌తో నేసిన బనారస్‌ చీరలకు మస్తు గిరాకీ ఏర్పడింది. దేశ, విదేశాల నుంచి పెద్దయెత్తున ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తాము తయారు చేస్తున్న రామ మందిరం థీమ్‌ చీరలు ఫ్యాషన్‌ ట్రెండ్‌ సృష్టించబోతున్నాయని యూపీలోని ముబారక్‌పూర్‌కు చెందిన అనిసూర్‌ రెహ్మాన్‌ అనే వ్యాపారి పేర్కొన్నారు. 

రామ్‌ దర్బార్‌ వర్ణన ఉన్న చీరలకు చాలా డిమాండ్‌ ఉన్నదని పీలి కోఠి ప్రాంతానికి చెందిన మరొకరు తెలిపారు. క్వాలిటీ, డిజైన్‌ను బట్టి ఒక్కో చీర ధర రూ.7 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉన్నదని వ్యాపారులంటున్నారు.