నాలుగు నెలల్లో సైబర్ నేరాలతో రూ 7,061 కోట్ల దోపిడీ

దేశంలో సైబర్ నేరాలతో నాలుగు నెలల్లో రూ.7,061.51 కోట్లు లూటీ చేశారు నేరగాళ్లు.‌ అలాగే దేశంలో సైబర్ నేరాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు సగటున ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈవో రాజేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు. 

2021-2022 మధ్య కాలంలో దేశంలో సైబర్ నేరాల ఫిర్యాదులు 113.7 శాతం పెరగాయి. 2019లో ఇటువంటి ఫిర్యాదుల సంఖ్య 26,049 ఉండగా, ఈ సంఖ్య 2020లో 2,55,777కు చేరుకుంది. 2021లో 4,52,414, 2022లో 9,56,790, 2023లో 15,56,215. చాలా ఫిర్యాదులు నకిలీ ట్రేడింగ్ యాప్ లు, లోన్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లకు సంబంధించినవిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

సైబర్ క్రైం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాలకు సంబంధించి మొత్తం 4,599 ఫిర్యాదులు అందాయి. వాటిలో స్కామర్లు మొత్తం రూ.1203.06 కోట్లను దోచేశారు. ఇది కాకుండా ట్రేడింగ్ మోసాలకు  సంబంధించి 20,043 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రజలు 14,205.83 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. 

పెట్టుబడి మోసాలపై 62,687 ఫిర్యాదులు అందాయి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.2,225.82 కోట్ల మేర ప్రజలను మోసం చేశారు. ఇది కాకుండా 1,725 డేటింగ్ స్కామ్‌ల ఫిర్యాదులు అందాయి, ఇందులో రూ.132.31 కోట్ల మోసం జరిగింది.

గత 4 నెలల్లో సుమారు 3.25 లక్షల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇది కాకుండా 5.3 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేశామని, వాట్సాప్ గ్రూపులతో సహా 3,401 సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. సైబర్ నేరాలపై వివిధ సంస్థల ద్వారా మొత్తం 10,000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.