నగల దుకాణంలో 30 గంటలు సోదాల్లో రూ.116 కోట్ల ఆస్తులు సీజ్

మహారాష్ట్ర నాసిక్ లోని సురానా జ్యువెల్లర్స్ దుకాణం, యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కలు చూపని రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ శాఖ అధికారులు. 
 
సురానా జ్యువెలర్స్‌ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడిందనే కారణంతో మే 23 సాయంత్రం నుంచి దాదాపు 30గంటలుగా ఐటీ శాఖ దాడులు నిర్వహించి భారీగా నగదును జప్తు చేసింది. మే 23వ తేదీ సాయంత్రం ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌ మెంట్ డైరెక్టర్ జనరల్ సతీష్ శర్మ నేతృత్వంలో అధికారులు సురానా జ్యువెల్లర్స్, కార్యాలయంపైన దాడులు జరిపారు. 
 
నాసిక్, నాగ్‌ పుర్, జల్గావ్ బృందానికి చెందిన 50-55 మంది ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు. అదే సమయంలో రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే ప్రైవేట్ లాకర్లు, ఆయనకు పలు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. మన్మాడ్, నంద్గావ్‌లో ఉన్న సురానా జ్యువెల్లర్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు.
 
అయితే, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తొలుత కార్యాలయాలు, ప్రైవేట్ లాకర్లలో కొద్దిపాటి నగదు మాత్రమే దొరికింది. అదే సమయంలో సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాను తనిఖీ చేయగా అక్కడ లాకర్లలో కూడా డబ్బు కనిపించలేదు. 
 
ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి బంగ్లాలో ఉన్న ఫర్నీచర్ ను బద్దలు కొట్టగా నగదు గుట్టలు గుట్టలుగా బయటపడింది. వెంటనే ఆ నగదును లెక్కించేందుకు సీబీఎస్ సమీపంలోని స్టేట్ బ్యాంకుకు వెళ్లగా శనివారం సెలవు కావడం వల్ల బ్యాంకు మూసి ఉంది.  వెంటనే స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జ్యువెల్లర్స్ యజమాని బంధువు బంగ్లాలో జప్తు చేసిన నగదును దాదాపు 14గంటలపాటు శ్రమించి లెక్కించారు అధికారులు. అంతకుముందు జప్తు చేసిన నగదును ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో పెట్టి తరలించారు.