టిడిపికి ఎంపీ కేశినేని రాజీనామా!

కొంతకాలంగా టిడిపి నాయకత్వానికి కొరకరాని కొయ్యిగా ఉంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చివరకు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం సరికాదని తెలిపారు. లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ మేరకు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసారు. దీంతో, కేశినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. విజయవాడ టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన సందేశంగా పార్టీ నేతల ద్వారా నానికి సమాచారం ఇవ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 
 
ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా వెల్లడించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని, విజయవాడ సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఇవ్వనున్నట్లు తనకు సందేశం పంపారని చెప్పారు. దీంతో కేశినేని నాని చంద్రబాబు చెప్పినట్లుగానే పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేస్తూ తాను ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు.
 
‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన . కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
 
విజయవాడ నియోజకవర్గం టిడిపిలో కేశినేని నాని, ఆయన తమ్ముడు కేశినేని చిన్నిల మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న పోరు జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ నాయకత్వం చిన్నికి మద్దతు పలుకుతూ ఉండటం, వచ్చే ఎన్నికలలో నానికి కాకుండా చిన్నికి సీటు ఇచ్చేందుకు సిద్దపడుతూ ఉండడంతో తరచూ నాని పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా వ్యవహరిస్తున్నారు.
 
దానితో టీడీపీని కేశినేని వీడటం కాయమైంది. దీంతో, రాజకీయంగా ఆయన తరువాతి అడుగులు ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. నానికి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారంతో ఆ పార్టీలో నాని చేరే అవకాశం లేదని చెబుతున్నారు.
 
 వైసీపీ నేతలతో కొంత కాలంగా నాని సన్నిహితంగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో మంచి చేసే వారిని ప్రోత్సహించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చెప్పుకొచ్చారు. నాని వైసీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని అప్పట్లోనే వైసీపీ ముఖ్యనేతలు స్పష్టం చేసారు. ఇప్పుడు నాని ఇక టీడీపీ వీడాలని నిర్ణయించటంతో ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి సహితం విజయవాడలో గట్టి అభ్యర్థి లేరు.

తాజా పరిణామాల పైన స్పందించిన ఆయన త్వరలోనే సరైన నిర్ణయం ఉంటుందని చెబుతూ ఏదేమైనా తాను పోటీకి దూరంగా ఉండాలన్నా..విజయవాడ ప్రజలు ఊరుకోరని, తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో నాని వైసీపీ లేక ఏదైనా పార్టీలో చేరుతారా? స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలుస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
 
నానితో పాటుగా విజయవాడ లోక్ సభ పరిధిలో ఆయన మద్దతు దారులు అసెంబ్లీ అభ్యర్దులుగానూ పోటీ చేయించేలనే ఆలోచన జరుగుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో నానితో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారని తెలుస్తున్నది.