బెంగాల్ ‘ఇండియా’ కూటమిలో సీట్ల రచ్చ

దేశం అంతటా బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టేందుకు సీట్ల సర్దుబాట్లు చేసుకుంటామని `ఇండియా’ కూటమి పక్షాలు చెబుతున్నప్పటికీ, సంక్రాంతి లోగా సర్దుబాట్లు పూర్తయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని అంటున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం పరస్పరం ఆరోపణలతో వీధికెక్కుతున్నారు.                  `ఇండియా’ కూటమి పక్షాలైన తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది.

రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తృణమూల్‌ 2 సీట్లను కేటాయించనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై కాంగ్రెస్‌ భగ్గుమన్నది.  తమ పార్టీకి సీఎం మమతా బెనర్జీ దయ అవసరం లేదని, సీట్ల కోసం తమ పార్టీ దేహీ అనదని, ఆమె ఇచ్చే దానికన్నా అక్కడ ఎక్కువ సీట్లే సొంతంగా పోటీ చేసి గెల్చుకుంటామని పేర్కొంటూ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పైగా, తృణమూల్‌ అధ్యక్షురాలైన మమత అసలు ఉద్దేశం `ఇండియా’ కూటమి నుంచి బయటకు వెళ్లడమని, అందుకే ఆమె ఈ రెండు సీట్ల ప్రతిపాదన తెచ్చారని ఆయన ఆరోపించారు.  పైగా,  ప్రధాని నరేంద్ర మోదీకి సేవ చేయడంలో మమత బిజీగా ఉన్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపాయి. 

కాంగ్రెస్‌తో పొత్తు ఉండకూడదనే మమత కోరుకుంటున్నారని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీచేయగలదని ఆయన స్పష్టం చేశారు. తాము బిచ్చం అడగడం లేదని, తమతో పొత్తును మమత స్వయంగా కోరుకున్నారని ఆయన చెప్పారు.  మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని, తాము సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేయగలమని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ అవసరం మమతకే ఎక్కువగా ఉందని, ఆ విషయం ఆమెకు కూడా తెలుసుని అంటూ  ఎద్దేవా చేశారు.

అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శలపై టీఎంసీ అధినాయకత్వం తీవ్రంగా స్పందించింది. నిత్యం చౌదరి, మరికొందరు నేతలు తమ పార్టీపై బురద జల్లుతూ పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌ ఆరోపించారు. తాము కాంగ్రెస్‌కు రెండే సీట్లు ఇస్తామని ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

వాస్తవానికి, కాంగ్రెస్ కోరుతున్న నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు  టిఎంసి సుముఖంగా ఉన్నప్పటికీ నిత్యం మమతాపై విమర్శలు గుప్పిస్తుండే చౌదరి వంటి కాంగ్రెస్ నేతలకు ఆ సీట్లు ఇవ్వడం పట్ల అనాసక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు, పెట్టు పెట్టుకుంటూ మరోవైపు నిత్యం విమర్శలు చేస్తుండటం కారణంగా పరోక్షంగా బిజెపికి అస్త్రాలు ఇచ్చినట్లు అవుతుందని టిఎంసి నేతలు చెబుతున్నారు. 

రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తామే సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకుంటామని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకంపై అవగాహన ఏర్పడుతుందని టిఎంసి చెబుతోంది. 

ఇలా ఉండగా, ఇండియా కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను తామే సూచించామని టిఎంసి వర్గాలు చెబుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్‌కు తాము వ్యతిరేకం కాదని, కాని కన్వీనర్‌గా ఖర్గే ఉంటేనే మెరుగైన ప్రభావం చూపగలమన్నది తమ పార్టీ అభిప్రాయమని వారు చెప్పారు.

ఇంకోవైపు, బిజెపి సహితం పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. సగంకు పైగా లోక్‌సభ సీట్లు గెల్చుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల లోపుగానే పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నిబంధనలు ప్రకటిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం బెంగాల్ ను దృష్టిలో ఉంచుకొనే అని స్పష్టం అవుతుంది. 

గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ చట్టాన్ని చూపి గణనీయంగా ఓట్లు పొందిన బిజెపి ఆ తర్వాత దానిని ఇప్పటి వరకు అమలులోకి తీసుకు రాలేక పోవడంతో కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నది.