అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం

గత 26 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.  అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. 

ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ తాజాగా ఉత్తర్వులలో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు రూ.3వేలు తగ్గించి రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టీనెన్స్‌ యాక్ట్‌’కు సంక్షిప్త రూపం. 1981లో రూపొందించిన చట్టమిది. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. 

అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. తాజా జీవో నంబర్ 2తో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎస్మా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణించింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చెయ్యకూడదని ఆదేశాలు ఇచ్చారు.

తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.  2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తాయంటోంది ప్రభుత్వం. 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.  సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో అంగన్వాడీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

జీతాల పెంపు, గ్రాట్యుటీ పెంపుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 26 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. వారితో దఫదఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లపై స్పష్టత ఇవ్వలేకపోయింది. ఆర్థికంగా ప్రభావం పడని వాటికి ఓకే చెప్పింది కానీ జీతాల పెంపుపై వారికి హామీ ఇవ్వలేదు.
 
జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె కొనసాగించం వలన ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం అంగన్వాడీలకు వివరించింది. అయినా వారు సమ్మె విరమించకపోవటంతో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.