విజయవంతంగా ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్‌-1

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. తొలి ప్రయతంలోనే సోలార్‌ మిషన్‌ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను ఇస్రో శనివారం విజయవంతంగా హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.
 
ఇటీవల చంద్రయాన్‌-3 ప్రయోగంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఇస్రో తాజాగా మరో ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత సత్తాను మరోసారి ప్రపంచ దేశాలకు చూపించింది. సెప్టెంబర్‌ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది.
 
63 నిమిషాల 20 సెకన్లపాటు ప్రయాణించిన తర్వాత ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌ను భూమి చుట్టూ 235*19500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది.  ఈ ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది.
 
భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాగ్రాంజ్ పాయింట్ భూమి-సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది.  అక్కడ సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదేననే సంగతి తెలిసిందే.
విజయవంతంగా ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశం మరో మైలురాయిని చేరిందని ప్రకటన చేశారు.
 
సెప్టెంబరు 18 వ తేదీ నుంచే సూర్యుడి శాస్త్రీయ సమాచారం సేకరించడం మొదలు పెట్టిన ఆదిత్య ఎల్ 1.. సెప్టెంబరు 19 వ తేదీ నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. అయితే ఈ ఆదిత్య ఎల్-1 కక్ష్యలో తిరుగుతూ సూర్యుడి గురించిన సమాచారాన్ని సేకరించేందుకు తనతోపాటు తీసుకెళ్లిన పరికరాలను ఉపయోగించనుంది. 
 
సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది. కాగా ఈ ఆదిత్య ఎల్ 1 సూర్యుడిపై అడుగు పెట్టకున్నా సూర్యుడికి దూరంగానే ఉంటూ అక్కడ ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది.  దీని వల్ల అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు.
సౌర తుఫానులు దాటిపోయేంత వరకు మన శాటిలైట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మోడ్‌లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఆదిత్య ఎల్-1 సౌర తుఫానులపై నిఘా ఉంచి అంతరిక్ష రక్షకుడిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.cగత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగం చేపట్టారు. వ్యోమనౌక ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కీలక సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది.