జగన్‌ నమ్మించి గొంతు కోశారు

వైఎస్ఆర్సీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని, తనకు టికెట్ లేదని బయటకు పంపించారని ధ్వజమెత్తారు. జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. తనకు అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు వచ్చిన రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ `జగన్ కు ఓ దండం’ అంటూ మాట్లాడారు. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చానని గుర్తు చేశారు. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశామని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

“జగన్ వైసీపీ పార్టీ పెడితే 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకుని వచ్చా. జగన్ ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. నాకు మంత్రి పదవి ఇస్తానన్న జగన్  ఇవ్వ లేదు. రాత్రనకా పగలనకా గడపగడపకు తిరిగాం. ఇన్నేళ్లూ జగన్ ఏం చేబితే అది అదే చేశాం. ఇప్పుడు  సర్వే రిపోర్టు పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది.” అంటూ ధ్వజం ఎత్తారు. 

 టికెట్ ఇవ్వడం లేదని సజ్జల స్పష్టం చేశారని అంటూ ఇంతకన్నా అవమానం మరోటి లేదని తెలిపారు.  “మమ్మల్ని నమ్మించి గొంతుకోశారు. మా జీవితాలు సర్వ నాశనమయ్యాయి. ఈ రోజుకీ జగనే మా సర్వస్వం అని భావించాం. జగన్ ను మా దేవుడితో సమానంగా చూశాం. ఇలా నమ్మించి గొంతు కోస్తారని ఊహించలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంను కలిసి మాట్లాడడం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదని చెబుతూ ఇంత కన్నా అవమానం మాకు ఎప్పుడు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ నుండి అయినా పోటీకి సిద్దం అని ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు తాను ఒక్కసారీ వేరే పార్టీతో మాట్లాడలేదని తెలిపారు.