ముకేశ్‌ అంబానీని వెనక్కు నెట్టిన అదానీ

అదానీ గ్రూప్‌ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద తిరిగి పుంజుకున్నది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ భారతీయ శ్రీమంతుడిగా కొనసాగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి మరోసారి అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 
 
బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా జాబితా ప్రకారం అదానీ సంపద 97.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ముకేశ్‌ అంబానీ 97 బిలియన్‌ డాలర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో భారత్‌లోనేగాక, ఆసియా దేశాల్లోనూ అపర కుబేరుడు గౌతమ్‌ అదానీయేనని తేలింది.  ప్రపంచ శ్రీమంతుల ర్యాంకుల్లో అదానీ 12వ స్థానంలో ఉన్నారు. ముకేశ్‌ 13వ స్థానంలో ఉన్నట్టు బ్లూంబర్గ్‌ తెలిపింది. 
 
గత నెల విడుదల చేసిన జాబితాలో అంబానీ 14వ స్థానంలో ఉంటే, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ కేసులో సెబీ దర్యాప్తును సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో అదానీ సంపద ఒక్కరోజులోనే 7.7 బిలియన్‌ డాలర్లు ఎగబాకడం గమనార్హం. ఇదే ముకేశ్‌ను దాటి అదానీని నెంబర్‌ 1ను చేసింది. ఇక ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా గౌతమ్‌ అదానీ సంపద 13.3 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. 
 
అదానీ గ్రూప్‌ సంస్థల షేర్లను కొనేందుకు మదుపరులు పోటీపడ్డారు. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు భారతీయ అపర కుబేరుడిగా అదానీ వెలుగొందిన సంగతి విదితమే. ఇక ఒకానొక దశలోనైతే అదానీ సంపద 150 బిలియన్‌ డాలర్లను తాకింది. ఈ సమయంలోనే టాప్‌-3 ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా అదానీ రికార్డు సృష్టించారు. 
 
అయితే హిండెన్‌బర్గ్‌ చేసిన అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఏకంగా 85 శాతం మార్కెట్‌ విలువను అదానీ గ్రూప్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా అదానీ వ్యక్తిగత సంపద సైతం దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ముకేశ్‌ అంబానీ సంపద 665 మిలియన్‌ డాలర్లు ఎగిసింది. 
 
అలాగే తాజా జాబితా టాప్‌-50లో ఉన్న భారతీయుల విషయానికొస్తే 34.6 బిలియన్‌ డాలర్ల సంపదతో షాపూర్‌ మిస్త్రీ 38వ స్థానంలో, 33 బిలియన్‌ డాలర్లతో శివ్‌ నాడార్‌ 44వ స్థానంలో ఉన్నారు. కాగా, అదానీ గ్రూప్‌ సంస్థల్లో అత్యంత ప్రధానమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరం (2022-23) 17 బిలియన్‌ డాలర్లు పెరిగినట్టు బ్లూంబర్గ్‌ తెలిపింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన 9 సంస్థలు ట్రేడ్‌ అవుతున్నది తెలిసిందే.