ఢిల్లీలో హిజ్బుల్‌ ముజాహిద్‌ ఉగ్రవాది అరెస్ట్‌

దేశ రాజధాని ఢిల్లీలో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వాంటెడ్ టెర్రరిస్టును పోలీసు స్పెషల్ సెల్ గురువారం అరెస్టు చేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి అతడిని పట్టుకున్నారు.  జమ్మూ కాశ్మీర్‌ లోని సోపోర్ లో నివసిస్తున్న జావేద్ అహ్మద్ మట్టూ, కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.
పాకిస్థాన్ టెర్రిరస్టులతో కలిసి పని చేశాడు. అతను హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ల నుండి శిక్షణ పొంది.. ఆయుధాలు సంపాదించాడు.  గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఆ సంస్థ మాజీ చీఫ్ రియాజ్ నైకూకు మట్టూ సన్నిహితుడు. 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మట్టూ సోదరుడు రయీస్ మట్టూ కశ్మీర్ లో భారత త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ కనిపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  రయీస్ మాట్లాడుతూ తాను భారతీయుడినని, తన సోదరుడి పనులకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. హింసను విడనాడి జన స్రవంతిలోకి తిరిగి రావాలని కోరాడు.  ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం మట్టూ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

పోలీసులకు నిఘాకు చిక్కిన అతడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. పిస్టల్, గ్రనైడ్ లతోపాటు కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని తలపై రూ.5 లక్షల రివార్డు సైతం ఉన్నది. ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కశ్మీర్‌లో జరిగిన దాడుల్లో మట్టూ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.