అయోధ్యకు విరాళంగా 300 టన్నుల బియ్యం, కూరగాయలు

 
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని, రాష్ట్రపతిలతో పాటు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అంతకు మించి లక్షలాదిగా భక్తులు కూడా హాజరుకాబోతున్నారు. 
 
దీంతో వీరికి అక్కడే అన్నదానం జరగబోతోంది. దీనికి విరాళంగా దేశం నలుమూలల నుండి ప్రజలు కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు పంపుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి సరిపోయేలా భారీ ఎత్తున వంటలు చేస్తున్నారు. 
 
ఇందుకోసం ప్రత్యేకంగా వంటశాలలు కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో  శ్రీరాముడి అమ్మగారి ప్రదేశమైన చ్చత్తిస్ ఘర్ లోని చందాఖురి నుండి 300 టన్నుల బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో సహా అయోధ్యకు బయలుదేరాయి. 15కు పైగా వాహనాల ద్వారా పంపుతున్న వీటిని ముఖ్యమంత్రి విష్ణుదేవి సాయి జెండా ఊపి పంపారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీటిని బహుకరించింది.
 
ఈ ఆహారం అంతా అయోధ్యలోని ‘కార్యశాల’లో నిల్వ చేస్తారు. భక్తులు అయోధ్యలోకి రావడం మొదలయ్యాక వంటలు ప్రారంభిస్తారు. అప్పుడు వీటిని వాడాలని ట్రస్ట్ నిర్ణయించింది. మరోవైపు భారతీయ పురాణాలలో రాముడి మాతృభూమి అయిన రాయ్‌పూర్ నుండి కూడా బియ్యం ట్రక్కులు వస్తున్నాయి. 

అలాగే మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు, పదార్ధాలు వచ్చి పడుతున్నాయి.  వీటిని ఎప్పటికప్పుడు నిల్వ చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట రోజు ఎవరూ ఆకలితో వెనుదిరగకుండా ట్రస్టు సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.