కాళేశ్వ‌రంపై ఎప్పుడు దర్యాప్తు ఆదేశిస్తారు రేవంత్!

ఎన్నిక‌ల‌లో ఇచ్చిన హామీ మేర‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో జ‌రిగిన అవినీతిపై ఎప్పుడు ద‌ర్యాప్తు చేయిస్తార‌ని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి నిల‌దీశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ రాష్త్రానికి సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు చేయకుండా బీఆర్ఎస్ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ చట్టాన్ని తీసివేసి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందా? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు అని పేర్కొంటూ ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా సైలెంట్ అవుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. 
 
సీఎం రేవంత్ రెడ్డికి దోషులకు శిక్ష పడాలని ఉందా.. లేదా..? ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలని, అందుకోసం అయినా సీబీఐ దర్యాప్తు కోరాలని సూచించారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ కోరిన 48 గంటల్లోనే దర్యాప్తు మొదలు అయ్యేలా చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 
కాళేశ్వర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదరకపోతే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించాలని తెలంగాణ కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇంజనీరింగ్ మార్వెల్, కేసీఆర్ అపరభగీరథుడని బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పారని, ప్రాజెక్టు నిర్మాణంలో 7 బుర్జ్ ఖలీఫాలకు సమానమైన కాంక్రీట్ ను వాడడం,15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడే ఉక్కును ఉపయోగించినట్లు ప్రచారం చేసుకున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.

డిస్కవరీ చానళ్లలో కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ గా పొగడ్తలతో డాక్యుమెంటరీల ప్రదర్శించారని, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారిందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ప్రజాధనాన్ని గోదావరిపాలు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు కట్టడంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని కిషన్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాడు రేవంత్ రెడ్డి బిజెపి ఏం చేస్తోందంటూ పదేపదే మాట్లాడారని గుర్తు చేస్తూ మరి నేడు మీ వైఖరేంటో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.