కాలువలో పంజాబ్ పోలీసు ఆఫీస‌ర్ మృత‌దేహం

కాలువలో పంజాబ్ పోలీసు ఆఫీస‌ర్ మృత‌దేహం
అర్జున అవార్డు గ్ర‌హీత‌, పంజాబ్ డీఎస్పీ ద‌ల్బీర్ సింగ్ డియోల్ (54) అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ద‌ల్బీర్ సింగ్ మృతదేహాన్ని జ‌లంధ‌ర్‌లోని ఓ కాలువ‌లో పోలీసులు క‌నుగొన్నారు. అయితే ద‌ల్బీర్ సింగ్ శ‌రీరంపై గాయాలు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
ఘ‌ట‌నాస్థ‌లి నుంచి డీఎస్పీ డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ప్ర‌స్తుతం ద‌ల్బీర్ జ‌లంధ‌ర్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. డీఎస్పీ హ‌త్య‌కు గుర‌య్యాడా..? ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
జ‌లంధ‌ర్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని బ‌స్తీ బావా ఖేల్ కెనాల్ వ‌ద్ద డీఎస్పీ మృత‌దేహం ల‌భ్యం కావ‌డంతో, అక్క‌డ ఆధారాలు సేక‌రించారు. నూతన సంవత్సర వేడుకలు జ‌రుపుకునేందుకు ద‌ల్బీర్ సింగ్ శ‌నివారం సాయంత్రం త‌న స్నేహితుల‌తో బ‌య‌ట‌కు వెళ్లాడ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
మ‌ళ్లీ ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి సహచరులు ఒక బస్సు స్టాండ్ వద్ద దించి వెళ్లగా, ఏదో వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ తెలిపారు. అయితే, మృతదేహం కాలువలోకి ఏవిధంగా వెళ్లిందో తెలియడం లేదు. సిసి ఫ్యూటేజ్, చివరన ఆయనను చూసిన వారిని ప్రశ్నించడం ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఏషియ‌న్ గేమ్స్‌లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్‌లో ద‌ల్బీర్ సింగ్ గోల్డ్ మెడ‌ల్ సాధించారు. 2000 ఏడాదిలో ఆయ‌న‌ను అర్జున అవార్డును వ‌రించింది.ఈ ఏడాది డిసెంబ‌ర్ 16వ తేదీన ద‌ల్బీర్ సింగ్ మ‌ద్యం మ‌త్తులో గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపారు. ఎందుకంటే బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం సేవించరాద‌ని చెప్పినందుకు ద‌ల్బీర్ కాల్పులు జ‌రిపి హంగామా సృష్టించారు. గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్లు సాక్షులు తెలిపారు.