
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల వరుసగా దాడులు జరిగిన ఘటనలో జరుపుతున్న దర్యాప్తులలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పురోగతి సాధించింది. అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తోన్న 43 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిసింది. కెనడా, బ్రిటన్, అమెరికాలో ఉన్న భారత ఎంబసీలపై ఈ దాడులు జరిగాయి. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఖలిస్థానీ మద్దతుదారులు అక్కడ దాడులకు తెగబడ్డారు.
మార్చి 19న ఈ ఘటన జరిగింది. జాతీయ పతాకాన్ని అగౌరపరిచే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన ఎన్ఐఏ.. నిందితులను గుర్తించాలని పౌరులను కోరింది. కాగా, జులై 2న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఎంబసీ ముందు ఈ తరహా దాడి జరిగింది. ఈ రెండు దాడులకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ నేరపూరిత అతిక్రమణ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, రాయబార సిబ్బందికి ముప్పు కలిగించడం వంటి అభియోగాలను మోపింది. దర్యాప్తులో భాగంగా ఆగస్టు 2023లో ఎన్ఐఏ బృందం శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లింది.
మరోవైపు, కెనడాలోనూ భారత్ హైకమిషన్ ముందు నిరసన చేపట్టిన సమయంలోనూ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాన్ని విసిరారు. వరుస ఘటనల నేపథ్యంలో భారత హోంశాఖ ఆదేశాలతో వీటిపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన మన దేశంలో దాదాపు 50 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 43 మంది ఖలిస్థానీ మద్దతుదారులైన అనుమానితులను గుర్తించినట్లు సమాచారం.
More Stories
నాగపూర్ హింసాకాండపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ