మకరజ్యోతి ఉత్సవాలకు తెరుచుకున్న అయ్యప్ప ఆలయం

41 రోజుల మండల పూజల అనంతరం మూతపడిన శబరిమల అయ్యప్ప ఆలయం.. మకరవిళక్కు మకరజ్యోతి ఉత్సవాల కోసం మళ్లీ తెరుచుకుంది. ఈ నెల 27 వ తేదీన రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన పూజారి కండారు మహేశ్ మోహనరారు శనివారం సాయంత్రం తెరిచారు. ప్రధాన పూజారి సమక్షంలో ముఖ్య పూజారి పీఎన్ మహేశ్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు.
 
జనవరి 13 వ తేదీన ప్రసాద శుద్ధ క్రియ, 14 వ తేదీన బింబ శుద్ధ క్రియలను నిర్వహించనున్నట్లు శబరిమల ఆలయం నిర్వాహణను చూసే ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక జనవరి 15 వ తేదీన మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే మకర జ్యోతి పూర్తయిన తర్వాత కూడా జనవరి 20 వ తేదీ వరకు శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచే ఉంచనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.
 
ఇక మండల పూజలు జరిగిన 41 రోజుల పాటు శబరిమలకు భారీగా భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయి అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి. ఈ క్రమంలోనే భక్తుల రద్దీని కేరళ పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఒకదశలో లాఠీఛార్జ్ కూడా జరిగింది.

అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా 41 రోజుల మండల పూజల సీజన్‌కు భక్తులు పోటెత్తడంతో మకరజ్యోతి సందర్భంగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్చువల్ క్యూ లైన్ల టిక్కెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతికి భారీగా భక్తులు పోటెత్తకుండా జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50 వేలకు తగ్గించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీసీ ప్రశాంత్ చెప్పారు. 

 
యాత్రికుల రద్దీని ఊహించి ముందస్తు బుకింగ్‌లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్‌లను 10 వేలకు పరిమితం చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకి వెళ్లే బదులు నిలక్కల్‌లో స్పాట్ బుకింగ్‌లను చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఇక ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తడంతో శబరిమల ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నవంబరు 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లో దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి.