మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. అనుమానిత మిలిటెంట్లు ఈసారి ఏకంగా భద్రతా బలగాలపై దాడికి దిగారు. వీరు జరిపిన దాడిలో ఓ జవాను గాయపడ్డాడు. రాష్ట్రంలోని తెంగనౌపాయ్ జిల్లాలోని మోరేహ్ పట్టణం వద్ద మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
 
మే నెల 3వ తేదీ నుంచి మణిపూర్ తెగల నడుమ సంకుల సమరంతో రగులుతోంది. శనివారం మధ్యాహ్నం మిలిటెంట్లు మెరుపుదాడికి దిగారు. మందుపాతరలు పేల్చడం, కాల్పులకు దిగడంతో ఈ ప్రాంతంలో చాలా సేపటివరకూ ఉద్రిక్తత ఏర్పడింది. భద్రతా బలగాల నుంచి కూడా సాయుధులపై ఎదురుదాడి జరిగింది. 
 
పరస్పర కాల్పులు జరిగాయి. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీస్‌ కమాండోలపై మిలిటెంట్స్‌ జరిపిన కాల్పులలో ఒక పోలీస్‌ కమాండోకు గాయాలయ్యాయి. అలాగే ఆందోళనకారులు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టారు. మణిపూర్‌లోని సరిహద్దు నగరమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. 
 
శనివారం అనుమానిత తిరుగుబాటుదారులు, పోలీసు కమాండోల మధ్య కాల్పులు జరిగాయి. మోరే నుంచి పెట్రోలింగ్ పాయింట్ వైపు వెళ్తున్న పోలీసు వాహనాల కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించారు. పోలీస్ కమాండోలపై కాల్పులు జరిపారు. ఒక కమాండో గాయపడగా, అస్సాం రైఫిల్స్ క్యాంపునకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, మోరేలో తాజాగా హింస చెలరేగింది. కొందరు వ్యక్తులు రెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో సంఘటనలో రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్‌పోక్పిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడ్ని కాల్చి చంపారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ సంఘటన జరిగింది.

మరోవైపు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ యువకుడి హత్యను ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. సమస్యలను చర్చలు ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.