ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా అరవింద్‌ పనగరియ

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియ 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్‌ రంజనమ్‌ పాండేను ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంఘం ఛైర్మన్‌, సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్‌ 31న ముగియనుంది.
 
కమిషన్ తన ఐదేళ్ల కాలానికి (2026-27 నుండి 2030-31 వరకు) తన నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం గత నెలలో  16వ ఆర్థిక సంఘం నియమనిబంధనలకు ఆమోదం తెలిపింది.  కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను సూచించడంతోపాటు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఏర్పాటు చేసిన నిధులకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రస్తుత ఏర్పాట్లను కమిషన్ సమీక్షిస్తుంది.
 
ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర- రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగ సంస్థ. 2021- 22 నుండి 2025 వరకు ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం విభజించదగిన పన్ను పూల్‌లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఎన్‌కె సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇది 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన స్థాయిలోనే ఉంది. 
ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి ఛైర్మన్‌గా అరవింద్‌ పనగరియను ప్రధాని నరేంద్ర మోదీ 2015లో నియమించారు.  అరవింద్‌ పనగరియ 1952 సెప్టెంబర్‌ 30న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం అనంతరం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.  అంతేగాక ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వరల్డ్ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లలో పనగరియ వివిధ హోదాల్లో పనిచేశారు.
 
2026 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఆ ఏడాది దాని జిడిపి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ నెల ప్రారంభంలో పనగారియా చెప్పారు. “ఈ రేటు ప్రకారం, ప్రస్తుత డాలర్లలో భారతదేశపు జిడిపి 2026లో 5 ట్రిలియన్ల అమెరికా డాలర్లకు, 2027లో  5.5 ట్రిలియన్లకు చేరుకుంటుంది. దీని అర్థం 2026 చివరి నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించే మంచి అవకాశాలు ఉన్నాయి” అని చెప్పారు.