అయోధ్యలో రోడ్లపై సూర్య స్తంభాలు

వచ్చే నెల రామ మందిరం ప్రతిష్ఠాపనకు అయోధ్య సన్నద్ధం అవుతుండగా, అయోధ్య పట్టణంలోని ప్రముఖ రోడ్డుపై సూర్య స్తంభాలను వరుసగా ఏర్పాటు చేస్తున్నారు. ౩౦ అడుగుల ఎత్తు ఉన్న ఆ స్తంభాలలో ప్రతి ఒక్క స్తంభానికి పైన ఏర్పాటు చేస్తున్న ప్రతిమ ఎలా ఉంటుందంటే రాత్రి వేళ వెలిగించినప్పుడు అది సూర్యుని ప్రతిబింబిస్తుంది. 

ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్ అయోధ్య డివిజన్ సీనియర్ అధికారి ఒకరి సమాచారం ప్రకారం, ధర్మ్ పథ్ అనే ఆ రోడ్డుపై అటువంటి 40 స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్డు నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో అనుసంధానిస్తుంది.

 ‘కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు ఆ సూర్య స్తంభాలను ఏర్పాటు చేసే పని సాగుతోంది. వాటిలో 20 స్తంభాలను లతా మంగేష్కర్ చౌక్ సమీపంలో ఏర్పాటు చేస్తారు. రోడ్డుకు ఒక్కొక్క వైపు 10 స్తంభాలు ఉంటాయి’ అని పిడబ్లుడి అసిస్టెంట్ ఇంజనీర్ ఎ పి సింగ్ తెలియజేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ౩౦న అయోధ్యకు రావలసి ఉన్నది. ఆ పర్యటనలో మోదీ పునర్వవస్థీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌కు, కొత్త విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆయన ఒక ర్యాలీలో ప్రసంగిస్తారని అధికారులు తెలియజేశారు.

కాగా, అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. దుకాణాల షట్టర్లు సైతం అయోధ్య రాముని పేరుతో పాటు స్వస్తిక్‌ గుర్తులతో నిండిపోయాయి. అయోధ్యకు దారితీసే 13 కిలోమీటర్ల పొడవైన సహదాత్‌గంజ్‌ నయాఘాట్‌ రోడ్‌లో రెండు వైపులా పెద్దయెత్తున దుకాణాలు ఉంటాయి.

25వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

ఆల‌యానికి వ‌చ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ (పీఎఫ్‌సీ)ని ఏర్పాటు చేశారు. ఆ సెంట‌ర్‌లో సుమారు 25వేల మంది ప‌ర్యాట‌కుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం ఉంటుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి చంప‌త్ రాయ్ తెలిపారు.  పీఎఫ్‌సీ వ‌ద్ద ఓ చిన్న ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టాయిలెట్‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల కోసం భారీ కాంప్లెక్స్‌ను కూడా నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాంప్లెక్స్ నుంచి వ‌చ్చే వేస్ట్ మెటీరియ‌ల్ కోసం సీవెర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.
 
ఆల‌య నిర్మాణం గురించి చంప‌త్ రాయ్ కీల‌క విష‌యాల‌ను చెప్పారు. ఆల‌య అవ‌స‌రాల కోసం అవ‌స‌ర‌మైతే స‌ర‌యూ న‌ది నుంచి లేదా భూగ‌ర్భం నుంచి నీరును తీసుకోనున్న‌ట్లు తెలిపారు. కానీ గ్రౌండ్‌వాట‌ర్ కేవ‌లం గ్రౌండ్‌లోకే వెళ్తుంద‌ని పేర్కొన్నారు. సుమారు 20 ఎక‌రాల స్థలంలో నిర్మాణం జ‌రుగుతోంద‌ని చెప్పారు. 
 
50 ఎక‌రాల స్థ‌లంలో ప‌చ్చ‌ద‌నం ఉంటుంద‌ని, ఇక్క‌డ ఉన్న చెట్లు వంద‌ల ఏండ్ల నుంచి ఉన్న‌ట్లు చెప్పారు. ఆల‌య స‌మీప నేలల్లో నీటి స్థాయి ఎన్నటికీ త‌గ్గ‌ద‌ని, ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే నీరు స‌ర‌యూ న‌దికి వెళ్ల‌డం లేద‌ని, జీరో డిస్‌చార్జ్ పాల‌సీని పాటిస్తున్న‌ట్లు చంప‌త్ రాయ్ వివరించారు.