జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్‌పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం

జమ్మూకశ్మీర్ ముస్లీం లీగ్ ను చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్రం ప్రకటించింది. ఉపా చట్టం కింద ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా.. భారతదేశం యొక్క ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఎవరైనా వదిలిపెట్టబోమన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాల్లో కేంద్రంలోని మోడీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ఉందని తేల్చిచెప్పారు. వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలం భట్ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్‌ ముస్లిం లీగ్ పనిచేస్తుంది. జమ్మూ కాశ్మీర్‌ ముస్లిం లీగ్ సభ్యులు.. రాష్ట్రంలో దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు.. ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. 2010 లో లోయలో జరిగిన స్వాతంత్ర్య అనుకూల నిరసనల ప్రధాన నిర్వాహకుల్లో ఆలం ఒకరు. ఆ నిరసనల తర్వాత అతనితో పాటు ఇతర నాయకులను కూడా అరెస్టు చేశారు. అనంతరం 2015 లో విడుదలయ్యాడు.