ఏడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు

రాబోయే నాలుగు వారాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే, జనవరి తొలివారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సాకాగ్‌ నివేదికపై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.
కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌లో కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తుల నమూనాలను జెనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌గా తేలింది.  మరోవైపు దేశంలో కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 చాపకింద నీరులా పాకుతోంది. 24 గంటల్లో 40 జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి.
దీంతో డిసెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కుఈ కొత్త వేరియంట్‌ కేసులు దేశవ్యాప్తంగా మొత్తం 109కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందులో అత్యధికంగా గుజరాత్‌లో 36 కేసులు బయటపడ్డాయి.  కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4‌, తమిళనాడులో 4, తెలంగాణలో 2 జేఎన్‌.1 కేసులు బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకలు పూరయ్యాక రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2020-22 సంవత్సరాల మధ్య కరోనా ట్రెండ్‌ను సమీక్షించగా జనవరిలో కరోనా కేసుల పెరుగుదల కనిపించింది. ఒమిక్రాన్‌ కారణంగా డిసెంబర్‌- జనవరి మధ్య గతేడాది కరోనా  రోజువారీ కేసులు పెరిగాయి. 

ఫిబ్రవరిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం జేఎన్‌.1 వేరియంట్‌ సబ్‌ ఫామ్‌ సైతం వ్యాప్తి చెందుతున్నది. దీని ఆర్‌ విలువ అంటే.. ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ కారణంగా జనవరి మొదటి వారంలో కేసులు భారీగా పెరిగితే మరో మూడు వారాలు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎంతకాలం స్థిరంగా ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కరోనా  కేసులు పెరుగుతుండడంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4వేల మార్క్‌ను దాటింది. ఇందులో అత్యధికంగా కేసులు 3 వేలకు పైగా కేరళలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో కరోనా  కేసులు నమోదవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,093గా ఉంది.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ పాజిటివ్‌ తేలితే తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.