విభజన హామీల అమలుకై ప్రధాని మోదీని కోరిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కలిసి అరగంటసేపు సంభాషించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విభజన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని వారి ప్రధానిని కోరారు.

అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటంపై విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ అరగంటపాటు కొనసాగింది.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి  ప్రధాని మోదీని కలవటం ఇదే తొలిసారి. 

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కాంగ్రెస్ పెద్దలను కలిసి రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఇక లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని భేటీ అనంతరం విక్రమార్క మీడియాకు తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు.
కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని,.పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగామని చెప్పారు.  పెండింగ్‌లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టుకు మంజూరు చేయాలని కోరామని,  తెలంగాణకు ఐఐఎం, సైనిక్ స్కూల్‌ మంజూరు చేయాలని అడిగామని చెప్పారు.
బిఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని పేర్కొంటూ  అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.  2015-19, 2020-21కి సంబంధించి రూ. 450 కోట్లు రావాల్సిన కొన్ని నిధులు గురించి అడిగామని, నీటి పారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరామని వివరించారు.
ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించామని చెప్పారు. శ్వేత పత్రం గురించి కూడా ఆయనకు తెలియజేశామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం నుంచి అందించే సహాయం అందించాలని కోరామని విక్రమార్క వివరించారు.