తెలంగాణాలో డబల్ డిజిట్ లోక్ సభ సీట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా తమ ఓట్ల శాతాన్ని 100 శాతం పెంచుకున్న బిజెపి రానున్న లోక్ సభ ఎన్నికలలో డబల్ డిజిట్ సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో అనుకున్న విధంగా సీట్లు గెల్చుకోలేక పోయినప్పటికీ ఓట్ల శాతం బాగా పెంచుకున్నామని తెలిపారు.
 
2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8 శాతం ఓట్లు రాగా, ఆ తర్వాత వంద రోజుల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు.  లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు డిసెంబర్ 28న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి ఏంటి షా పాల్గొంటారని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునిల్ బన్సల్, బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జులు పాల్గొంటారని వివరించారు.  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 90 రోజులకు గాను ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

డిసెంబరు 22, 23న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో జరిగిన జాతీయ పదాధికారులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో సమీక్షా సమావేశంలో ఈ విషయమై కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.  
తెలంగాణలో అన్ని వర్గాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా చర్చ జరుగుతోందని,  గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీకే ఓటు వేస్తామంటూ స్పష్టంగా చెబుతున్నారని కిషన్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. 
పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతూ  తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని తెలిపారు.  తెలంగాణలో యువతను ప్రోత్సహిస్తూ, జనవరి నెలలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకునేలా కార్యచరణ అమలు చేస్తామని వివరించారు.
 
రాహుల్ గాంధీ సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను.. పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని,  పార్లమెంటు ఎన్నికలకు ముడిపెట్టి ప్రచారం చేశారని తెలిపారు.  యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసిన సవాల్ ను ప్రజలు స్వీకరించి, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, బిజెపికి పట్టం గట్టారని గుర్తు చేశారు.

మధ్యప్రదేశ్ లో నభూతో నభవిష్యతి అనేలా రికార్డ్ స్థాయిలో మెజారిటీని కట్టబెట్టి విజయాన్ని అందించారని చెప్పారు. అవినీతిరహిత, కుటుంబ జోక్యం లేని, ప్రజా పరిపాలన దేశంలో మరోసారి రాబోతోందని, ఎవరూ ఊహించిన విధంగా అద్భుతమైన మెజారిటీతో నరేంద్ర మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, ఇంచార్జులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, మోర్చాల జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని తెలిపారు. కొంగరకలాన్ లోని శ్లోక ఫంక్షన్ హాల్ లో శ్లోక ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు.