తెలుగు రాష్ట్రాల్లో తొలి కరోనా మరణాలు

 
* విశాఖలో ఒకరు, హైదరాబాద్ లో ఇద్దరు మృతి
 
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో తొలి కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఈ నెల 24న విశాఖ కేజీహెచ్ లో ఓ మహిళ కరోనా లక్షణాలతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.  హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు కూడా కరోనా సోకింది.
 
మరోవంక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ స‌బ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 69కి చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఏపీలోని ఆక్టివ్ కేసుల్లో విశాఖలోనే 20 మందికి కరోనా బారిన పడ్డారు. 
 
ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోందని అధికారులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.  ఏపీలో కరోనా మరణంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

మరోవంక, తెలంగాణలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.  వివిధ అనారోగ్య కారణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్ప‌త్రిలోని ఎమర్జెన్సీలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మ‌రో వ్య‌క్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిలో చేరాడు.  అత‌ను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

కాగా.. ఆ ఇద్ద‌రు రోగుల‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇద్ద‌రు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు ఆస్ప‌త్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు. తెలంగాణలో సోమవారం 989 నమూనాలను పరీక్షించగా 10 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటిన్‌లో తెలిపింది. 

కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా రికవరీల సంఖ్య 8,40,392కి చేరుకుంది. కరోనా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తంకరోనా కేసులు 8,44,558. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న లేదా ఐసోలేషన్‌లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 55. రాష్ట్రంలో సోమవారం ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదని బులెటిన్ తెలిపింది. 

రాష్ట్రంలో కేసు మరణాల రేటు 0.49 శాతం, కోలుకునే రేటు 99.51 శాతంగా ఉంది. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 కరోనా సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. గోవాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపాయి. అయితే, ఇప్పటివరకు నివేదించిన కేసుల్లో క్లస్టరింగ్ ఏదీ లేదు. జేఎన్.1 సబ్‌వేరియంట్‌లోని అన్ని కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.