ఆర్బీఐ, మరో రెండు బ్యాంకులపై బాంబు దాడి బెదిరింపు

ఆర్బీఐ, మరో రెండు బ్యాంకులపై బాంబు దాడి బెదిరింపు
 
* నిర్మలా సీతారామన్, శక్తికాంత్ దాస్ రాజీనామాలకై డిమాండ్
 
ఆర్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లపై బాంబు దాడికి పాల్ప‌డ‌తామ‌ని హెచ్చ‌రిస్తూ ఆర్బీఐకి సోమ‌వారం బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌, ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ రాజీనామా చేయాల‌ని బెదిరింపు మెయిల్ పంపిన వ్య‌క్తి డిమాండ్ చేశాడ‌ని ముంబై పోలీసులు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ముంబైలోని 11 ప్ర‌దేశాల్లో 11 బాంబు దాడులు జ‌రుగుతాయ‌ని బెదిరింపు మెయిల్ హెచ్చ‌రించింది. మెయిల్‌లో ప్ర‌స్తావించిన ప్రాంతాల‌కు తాము విచారించేందుకు వెళ్లామ‌ని, అయితే అక్క‌డ ఎలాంటి అనుమానిత ప‌దార్ధాలు ల‌భ్యం కాలేద‌ని పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపులు వచ్చిన క్రమంలో అప్రమత్తమైనట్లు తెలిపారు.

బెదిరింపు మెయిల్ ఖిలాఫ‌త్‌.ఇండియా@జీమెయిల్‌.కాం అనే ఐడీ నుంచి వ‌చ్చింది. ముంబైలోని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేష‌న్‌లో ఈ ఉదంతంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై లోని మొత్తం 11 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ లో పేర్కొన్నారు దుండగులు. 

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబులు పెట్టిన మూడు ప్రాంతాలను ఇమెయిల్ లో పేర్కొన్నట్లు చెప్పారు. అవి ఆర్‌బీఐ న్యూ సెంట్రల్ బిల్డింగ్ ఫోర్ట్, ముంబై, హెచ్‌డీఎఫ్‌సీ హౌస్ చర్చ్ గేట్, ముంబై, ఐసీఐసీఐ బ్యాంక్ టవర్స్్ బీకేసీ ముంబై ఉన్నట్లు తెలిపారు. 

ఆయా బ్యాంకులకు హెచ్చరికలు చేసి బాంబులను గుర్తించే ప్రయత్నాలు మొదలు పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. మరోవైపు భారత దేశ చరిత్రలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు అతి పెద్ద కుంభకోణాలకు తెర తీశాయని దుండగులు ఇ-మెయిల్ లో పేర్కొన్నట్లు సమాచారం.

ఆ స్కామ్‌లో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, మంత్రులు ఉన్నారని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ పదవులకు రాజీనామాలు చేసి,  స్కామ్ సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆర్థిక మంత్రి, గవర్నర్లతో పాటు ఇందులో భాగమైన వారందరికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఖిలాపత్. ఇండియా అనే పేరున్న మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.