కశ్మీర్‌ మరో గాజా అవుతుంది : ఫరూఖ్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిస్థితులు మెల్లిమెల్లిగా సద్దుమణుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. ఎన్నో కార్పొరేట్ సంస్థలు, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ అక్కడి నాయకులు మాత్రం ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మొన్నటికిమొన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం.. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన తర్వాత కూడా.. వారి వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో చర్చలు జరపకపోతే.. కశ్మీర్ మరో గాజా అవుతుందని, దానికి పట్టిన గతే కశ్మీర్ కు పడుతుందని.. చెప్పుకొచ్చారు. ఫరూఖ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల పూంఛ్ సెక్టార్ దగ్గర జరిగిన ఉగ్రవాదుల మెరుపుదాడిలో ఐదుగురు జవాన్లు మరణించడం.. ఆ తర్వాతి రోజు మరో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం (డిసెంబర్-26) జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాలను సందర్శించి ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా ఉపయోగిస్తున్న గుహలను కూల్చివేయాలని ఆదేశించారు. దీనిపై ఫరూఖ్ అబ్దుల్లా స్పందిస్తూ.. కశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారం అని.. పాకిస్తాన్ అందుకు సిద్ధంగా ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. “త్వరలో నవాజ్ షరీప్ పాక్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి..? చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకపోతే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ ఎదురుకావచ్చు.” అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
ముగ్గురు పౌరులను చిత్రహింసలకు గురిచేసి చంపారని.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. “ఆర్మీ చీఫ్ నార్తర్న్ కమాండర్‌ని ఇక్కడి నుండి డెహ్రాడూన్‌లోని అకాడమీకి తీసుకువెళ్లారు, కానీ అది సమస్యను పరిష్కరించదు. ఇలా ఎందుకు జరిగిందనే దానిపై విచారణ జరగాలి..? ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేని అమాయకులను చంపారు. మనం ఏ దేశంలో జీవిస్తున్నాం.” అని ఆయన ప్రశ్నించారు. “మనం ప్రశాంతంగా జీవించగలిగే మహాత్మాగాంధీ భారతదేశం ఇదేనా..? హిందువులు మరియు ముస్లింలు ఒకరికొకరు శత్రువులుగా భావించేంత విద్వేషం వ్యాపించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం చేస్తామన్న బీజేపీ వాదనలు పూర్తిగా ట్రాష్.” అని అన్నారు.
వేర్పాటువాదులే.. కశ్మీర్‌కు శాపం
మరో గాజా అవుతుందంటూ రెచ్చగొడుతున్న ఫరూఖ్
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆర్టికల్ 370 కారణమని బీజేపీ నాయకులు చెప్పారని.. ఇక ఉగ్రవాదం ముగిసిందని ప్రకటనలు చేశారని.. ఫరూఖ్ గుర్తు చేశారు. కానీ అలాంటిదేమీ లేదని.. అంతా అబద్ధాలు చెబుతున్నారని.. ఉగ్రవాదం అంతం కాలేదని వ్యాఖ్యలు చేశారు. శిక్షణ పొందిన ఉగ్రవాదులు వస్తున్నా పట్టుకోవడం లేదని.. దానివల్ల అమాయక ప్రజలు బలవుతున్నారని.. అన్నారు. పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలా వద్దా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. వాజ్ పేయి అన్న మాటలు గుర్తు చేశారు. “మనం స్నేహితులను మార్చుకోవచ్చు కానీ.. పొరుగువారిని మార్చలేము అని పొరుగువారితో స్నేహంగా జీవిస్తే ఇద్దరం అభివృద్ధి చెందుతాం కానీ శత్రుత్వంతో జీవిస్తే వేగంగా పురోగమించలేం. యుద్ధం ఇప్పుడు ఒక ఆప్షన్‌ కాదు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి.” అని అన్నారు.
అయితే ఫరూఖ్ వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను ఆక్రమించుకుంటామని.. పార్లమెంట్ లో ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటనలు చేస్తున్న సమయంలో.. ఫరూఖ్ అబ్దుల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు కశ్మీర్ కు పాకిస్తాన్ సంబంధం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వేర్పాటువాదులకు గత ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరిచాయని.. అందువల్లే ఇన్నాళ్లూ కశ్మీర్ రక్తపాతంతో ఎరుపెక్కిందని.. గుర్తుచేస్తున్నారు. సుప్రీం తీర్పుతో కశ్మీర్ సమస్య ముగిసిన అధ్యాయం అని.. వేర్పాటువాదులు మాత్రం ఇంకా కశ్మీర్ ను పాకిస్తాన్ కు అప్పటించాలనే కలలు కంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అవెప్పటికీ నెరవేరేవి కావని స్పష్టం చేస్తున్నారు.