కరోనా వైరస్ పట్ల మరింతగా పర్యవేక్షణ

క్రమేపీ తిరిగి కరోనా కేసులు పెరుగుతున్న దశలో వైరస్ పట్ల మరింత పర్యవేక్షణ అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ దేశాలకు డబ్లుహెచ్‌ఒ తగు సూచనలు వెలువరించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పెరిగిన దశలో, మునుపటి జాగ్రత్త చర్యలు లోపిస్తున్న సమయంలో కరోనా పట్ల అప్రమత్తం కావల్సి ఉందని పిలుపు నిచ్చారు. 

ఇప్పుడు మునుపటి కరోనా దీనితో పాటు పలు రకాల శ్వాసకోశ సమస్యలు, కొత్త సబ్ వేరియంట్ జెఎన్ 1 వంటివి పలు దేశాలలో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు ఆగ్నేయాసియా దేశాలు నిరంతర జాగరూకతతో ఉండాలని సూచించారు. కరోనా పూర్తిగా అంతరించి పోలేదు. పలు విధాలుగా సరికొత్త రూపాలలో తలెత్తుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఇది ముప్పు తెచ్చిపెడుతోందని డబ్లుహెచ్‌ఒ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ హెచ్చరించారు.  ఎప్పటికప్పుడు వైరస్ రూపం మార్చుకొంటోంది. రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తోంది. పలు దేశాలలో ఈ సమస్య క్రమేపీ తీవ్రతరం అవుతోంది.ఇప్పుడు తలెత్తిన జెఎన్ 1 సబ్ వేరియంట్ ప్రజలలో ఆరోగ్య పరమైన సమస్యలు తెచ్చిపెడుతోందనే సమాచారం కలవరానికి దారితీస్తోందని సింగ్ పేర్కొన్నారు. 

వైరస్ ఉత్పత్తిని ఎప్పటికప్పుడు కనుగొంటూ , అందుకు అనుగుణంగా స్పందించాల్సి ఉంటుంది. నివారణ ఒక్కటే మార్గం. ఇందుకు తగు ముందు జాగ్రత్తలు అలసత్వం , ఏగవేతలు లేకుండా పాటించాల్సి ఉంటుందని డైరెక్టర్ వెల్లడించారు. జెఎన్ 1 వైరస్‌ను ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వేగవంతంగా వ్యాపించే రకం అని నిర్థారించారు. 

అయితే మొత్తం మీద చూస్తే ఇది అత్యంత ప్రమాదకరం కాకపోయినా , వ్యాప్తిక్రమంలో దీని లక్షణాలు ఇబ్బందికరం అని పేర్కొన్నారు. ఇప్పుడు ఏడాది ముగింపు, నూతన సంవత్సర వేడుకల వేళవుతోంది. పలు ప్రాంతాల్లో సెలవుదినాల సీజన్ కావడంతో ప్రయాణాలు , ఎక్కువగా జనం గుమికూడటం వంటి అంశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలిస్తోంది.

మరో వైపు ఎక్కువ సేపు ఇళ్లల్లోనే సరియైన రీతిలో గాలివెలుతురు లేని దశలో ఎక్కువ మంది గుమికూడి ఉండటం కూడా ఇబ్బందికరం అవుతోందని పేర్కొన్నారు. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా కోవిడ్ టీకాలు , ఇంఫ్లూయెంజా నివారణ చర్యలకు దిగాల్సి ఉంటుంది. శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్లుహెచ్‌ఒ సూచించింది.

వ్యాక్సీన్ అదనపు డోస్ అక్కర్లేదు

ఇలా ఉండగా, కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 ప్రబలుతూండటంతో ప్రజలలో మళ్లీ ఆందోళన మొదలైంది. దీనికోసం వ్యాక్సీన్ అదనపు డోస్ తీసుకోవాలనే ప్రచారం కూడా మొదలైంది. అయితే జేఎన్-1 వేరియంట్ కోసం అదనంగా వ్యాక్సీన్ డోస్ తీసుకోవలసిన అవసరం లేదని సార్స్ –కోవ్ 2 జినోమిక్స్ కన్సార్టియం చీఫ్ డాక్టర్ అరోరా స్పష్టం చేశారు. 

గతంలో సోకిన కరోనా వేరియంట్ కూ, దీనికీ మధ్య పెద్ద తేడా లేదని చెప్పారు. ఇప్పటి వరకు తాము 400 కోవిడ్ వేరియంట్లను గుర్తించామని, ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు. ఒమిక్రాన్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటివి వచ్చినా ఐదు రోజుల్లో కోలుకోవచ్చునని అరోరా తెలిపారు. 

దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కు సంబంధించిన 22 కేసులు వెలుగులోకి వచ్చినా, వీటిలో చాలా కేసులు ఆసుపత్రిలో చేరకుండానే నయమయ్యేవేనని చెప్పారు. అయితే పిల్లలు, 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తాజా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.