ఉత్తర భారతంలో పెరిగిన చలి తీవ్రత

* జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున మంచు
రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది. పశ్చిమ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యాన్‌, పంజాబ్‌, ఢిల్లి తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలకు పడిపోయాయి. 
 
రాజస్థాన్‌ సిరోహిలో అత్యల్పంగా 2.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కరౌలిలో 5.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫతేపూర్‌లో అత్యల్పంగా 5.6 డిగ్రీలు, చిరులో 5.5, జైసల్మీర్‌లో 6.7, ధోల్‌పూర్‌, దబాక్‌లో 7 డిగ్రీలు, అల్వార్లో 7.3 డిగ్రీలు, చిత్తోర్‌ఘఢ్‌లో 7.5, సంగారియా, శ్రీనంగానగర్‌లో 7.8డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ. ప్రైవేటు పాఠశాలలకు జనవరి ఒకటి నుంచి 15 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది.

హర్యానాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లిలో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు. 

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ను ఆదివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. రేవా, సత్నా జిల్లాల్లో రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అటు జమ్మూకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. హిమపాతం కప్పేసింది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా సింథాన్‌ టాప్‌ మీదుగా వెళ్లే కిష్త్వార్‌- అనంత్‌నాగ్‌ రహదారిని మూసివేశారు. 

శ్రీనగర్‌ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్‌ 3 డిగ్రీలకు పడిపోయాయి. అనంతనాగ్‌లో ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జమ్మూకాశ్మీర్‌లో చలికి ఇప్పటికే ప్రముఖ దాల్‌ సరస్సుతోపాటు నదుల్లో నీరు గడ్డకట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్‌ టన్నెల్‌ రెండు చివరలను మంచు కప్పేసింది.

దీంతో వాహనాల రాకపోకలకు అటల్‌ టన్నెల్‌ను మూసేశారు. కులు, లాహౌల్‌, స్పితి, చంబా ప్రాంతాల్లో హిమపాతం కురిసింది. రోహ్‌తంగ్‌ పాస్‌తోపాటు సిస్సు, బరాలాచా, కుంజమ్‌పాస్‌, కోక్సర్‌తో సహా పలు ప్రాంతాల్లో దట్టంగా హిమపాతం కురుస్తున్నది. పశ్చిమబెంగాల్‌, ఒడిశాలోనూ పొగమంచు కురుస్తోంది. దీంతో చలి తీవ్రత కూడా పెరిగింది. 

ఆయా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఉదయగిరిలో కనిష్ట ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఒడిశాలోని పూరీ, గంజాం, కలహండి, కోరాపట్ సహా 14 జిల్లాల్లో ఆదివారం కూడా పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు కోరారు. రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది. జీ ఉదయగిరి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.