విపత్తులకు 2,500 ఏండ్లు తట్టుకొనేలా రామాలయం

దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న గడియలు రానే వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే నెల 22 వ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. 
 
ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కు చెదరదట. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్‌ చేసినట్టు ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా తాజాగా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తుని చెప్పారు.  ఇక ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని, గర్భ గుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువని సోంపురా వివరించారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందని తెలిపారు. 
 
భక్తులకు సదుపాయాలపై మాట్లాడుతూ ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35- 40 వేల మంది వెళ్లే అవకాశం ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కాంప్లెక్స్‌ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రిసెర్చ్‌ సెంటర్‌, ప్రార్థన మందిరం వంటి ఇతర సౌకర్యాలను బయట ఏర్పాటు చేయాలని అనుకొంటున్నామని వివరించారు. 
 
రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా నేపాల్‌ పలు ప్రత్యేక కానుకలను పంపనున్నదని స్థానిక మీడియా పేర్కొన్నది. ఇందులో వివిధ రకాల నగలు, సామగ్రి, బట్టలు, మిఠాయిలు ఉంటాయని మై రిపబ్లికా వార్తాపత్రిక తెలిపింది.  వీటిని అందజేయడం కోసం జనక్‌పూర్‌ధామ్‌- అయోధ్యధామ్‌ ప్రయాణం జనవరి 18న ప్రారంభమవుతుందని, 20 నాటికి అయోధ్య చేరుకుంటుందని జానకి ఆలయ మహంత రామ్‌రోషణ్‌ దాస్‌ వైష్ణవ్‌ తెలిపారు. అదే రోజున కానుకలను రామ మందిర ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు. 
 
గతంలో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు నేపాల్‌ కాళిగండకి నదీ తీరంలో సేకరించిన శాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపిందని పత్రిక తెలిపింది. కాగా, ఆలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుభ్రతా పాథక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ భక్తులపై కాల్పులు జరిపించిన సమాజ్‌వాదీ పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపొద్దని రామ మందిర్‌ ట్రస్టుకు లేఖ రాశారు.

అద్భుతమైన ముహూర్తం

22న అద్భుతమైన ముహూర్తం ఉన్నట్లు జ్యోతిష్యులు వెల్లడించారు. 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందని వెల్లడించారు.  జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వెల్లడించారు. 

మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు అయోధ్య ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

మరోవైపు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆ నగరంలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇక అయోధ్యలోని హోటల్‌ గదుల రేట్లు భారీగా పెరిగి ఆకాశాన్నంటాయి. అటు వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి వరకు బుకింగ్స్ అయిపోయాయని, ఆ తర్వాతే కొత్త బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయని పేర్కొంటున్నారు. 

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో భద్రతా కారణాల దృష్ట్యా హోటల్‌ బుకింగ్‌లను అధికారులు రద్దు చేస్తున్నారు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లు ఉన్నాయి. అందులో రెండు మూడే 4 స్టార్‌ హోటళ్లు ఉండగా, మిగిలినవన్నీ 2, 3 స్టార్ల హోటళ్లే ఉన్నాయని అయోధ్య అధికారులు వెల్లడించారు.

ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పుణెకు చెందిన కేశవ్‌ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్‌ మహాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి రాముడి విగ్రహం ప్రతిష్ట వేళ అక్కడ శంఖనాదం చేయనున్నారు.