హిజాబ్ నిషేధం ఎత్తేసిన సిద్దరామయ్య ప్రభుత్వం

కర్ణాటకలో హిజాబ్​పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ప్రజలకు ఉందని ఉద్ఘాటించారు. కొంతకాలంగా  కర్ణాటకలో హిజాబ్ పై చెలరేగుతున్న వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యాసంస్థల్లో హిజాబ్​ వేసుకోవడాన్ని నిషేధిస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ప్రకంపనలే సృష్టించింది. 
 
పలు బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుతాలు సహితం హిజాబ్ పై నిషేధం విధించాయి. హిజాబ్​పై నిషేధానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. అయితే  ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది హైకోర్టు. కచ్చితంగా హిజాబ్​ వేసుకోవాలి, ఇస్లాం మతంలో లేదని,విద్యాసంస్థలు విద్యార్థుల డ్రెస్​ కోడ్​ని నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. 
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరుకూ వెళ్లింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యూనిఫామ్​ని నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉందని ఒక జడ్జి అభిప్రాయపడగా, హిజాబ్​ వేసుకోవాలా? వద్దా? అనేది ఛాయిస్​ అని మరో న్యాయమూర్తి పేర్కొన్నారు.

 మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ హిజాబ్ పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నది. తాజాగా  మైసూర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య  “మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. మీకు నచ్చిన ఆహారం తినండి. నాకు నచ్చింది నేను తింటాను. నేను ధోతీ వేసుకుంటాను. మీరు ప్యాంటు- షర్టు వేసుకోండి. ఇందులో తప్పేముంది? అందుకే హిజాబ్​పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాము” అని ప్రకటించారు. 

“మహిళలు హిజాబ్​ వేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు చెప్పాను. మహిళలు.. వారికి నచ్చిన దస్తులు వేసుకోవచ్చు,” అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డిసెంబర్ 23 నుండే ఈ విధానం అమలులోకి వస్తున్నట్లు వెల్లడించారు.