విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న వైజాగ్ కు అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెలాఖరు లోగా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్ కు సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలను తరలించేందుకు వీలుగా ఇప్పటికే జారీ చేసిన జీవోలను నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 
 
అంతే కాదు ఈ కేసును ముగ్గురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు రాజధానుల అమలుకు ఇచ్చిన హామీ మేరకు వైసీపీ సర్కార్ వైజాగ్ తరలింపు కోసం కార్యాలయాలు ఖరారు చేసేందుకు ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీని నియమించింది.  దీని ప్రకారం అధికారుల కమిటీ వైజాగ్ లో రిషికొండ, మిలీనియం టవర్స్ తో పాటు పలు చోట్ల కార్యాలయాలను గుర్తించింది.
వీటిని సీఎం, మంత్రులు, అధికారుల కోసం కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టుకు వెళ్లారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వైజాగ్ కు ప్రభుత్వ కార్యాలయాను అమరావతి నుంచి తరలించకుండా స్టేటస్ కో పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ పై తదుపరి విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
త్రిసభ్య ధర్మాసనంలో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరిపే వరకు స్టేటస్ కో అమలులో ఉంటుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో త్రిసభ్య ధర్మాసనంలో సీఎం క్యాంపు కార్యాలయం తరలింపుపై జరుగుతున్న కేసు విచారణతో కలిపి దీన్ని కూడా విచారించబోతోంది. ఈ పిటిషన్లు తేలితే తప్ప వైజాగ్ కు కార్యాలయాల తరలింపు కష్టమే.