మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత పథకం.. టిడిపి హామీ

ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. అన్నదాత కార్యక్రమం (తెలంగాణలో రైతు బంధు తరహా) ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 
 
విజయనగరం జిల్లా పోలెపల్లిలో బుధవారం టీడీపీ నిర్వహించిన ‘యువగళం – నవశకం’ సభ ద్వారా టీడీపీ – జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. పొత్తుపై ఇరు పార్టీల అధ్యక్షులు ఈ వేదికపై నుంచి స్పష్టత ఇచ్చారు. అతి త్వరలో టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. అమరావతి, తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోను విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు.
 
20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామని, అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని తెలిపారు. ఇంకా ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ‘ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. టీడీపీ -జనసేన పొత్తు ప్రకటించినప్పుడే వైసీపీ పని అయిపోయింది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళలకు రక్షణ ఉండాలంటే ‘ఆంధ్రప్రదేశ్’ వైసీపీ విముక్త రాష్ట్రంగా మారాలని చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని, జగన్‌ రాజకీయాలకు అనర్హుడని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు చరిత్రాత్మకమని, ఈ రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు పార్టీల పొత్తుతో వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని, తహశీల్దార్లను బదిలీ చేసినట్టు ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 
రాష్ట్ర ప్రజలు, ఆడపిల్లలు, యువత బాగు కోసం వైసీపీ పోవాలని చెబుతూ ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుందని హెచ్చరించారు. ఒక్క చాన్స్‌ అని చెప్పి ఐదేళ్ల పాలనలో విధ్వంసం చేశారని, వారు చేసిన తప్పులు, వాటి ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం ఏపీలోనే ఉందని, అధికార పార్టీకి ఓటు వేయరని గుర్తించిన వారిని జాబితాలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
తన ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని ముఖ్యమంత్రి మనకెందుకు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్పు తీసుకొస్తాం – వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్ స్పష్టం చేశారు.
 
గతంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ ఉండేదని, ఇప్పుడేమో  సీఎం జగన్ పాలనలో ఏపీకి రావాలంటే ఐఏఎస్ లు, ఐపీఎస్ లు భయపడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం నీచ సంస్కృతిని మొదలుపెట్టింది. ప్రతిపక్ష నేతల ఇంట్లో మహిళలపై నీచంగా మాట్లాడారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎవరూ ఇంట్లో మహిళల గురించి మాట్లాడలేదు. జగన్ ఈ విష సంస్కృతి తీసుకొచ్చారు. తన ఇంట్లో అమ్మ, చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఇతర మహిళలకు ఎలా గౌరవం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు” అంటూ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు.