తెలంగాణాలో తిరుగులేని రాజకీయ శక్తిగా బీజేపీ

 
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయాలను నమోదు చేసుకొని బిజెపి  రాజకీయ ప్రత్యర్థులను విస్మయంకు గురిచేసింది. మధ్య ప్రదేశ్ లో అందరి అంచనాలను కాలదన్ని ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది.
 
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్న అన్ని సర్వేలను వమ్ముచేసి ఎవ్వరూ ఉహించనంతటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. రాజస్థాన్ లో సహితం అదేవిధంగా జరిగింది.  ఇక దక్షిణాదిన కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి  బొటాబొటి ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినప్పటికీ ఈ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలు రాజకీయ ప్రత్యర్థులకు ఆందోళన కలిగిస్తున్నది.
బిజెపి కేవలం 8 సీట్లు మాత్రమే గెల్చుకున్నప్పటికీ ఎన్నికలపై చూపిన ప్రభావం గమనిస్తే తెలంగాణాలో తిరుగులేని శక్తిగా బిజెపి సమాయత్తం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు, బీఆర్ఎస్ అవమానకర పరాజయం నేపథ్యంలో అందరూ బీజేపీ వహించిన పాత్రను తక్కువగా అంచనా వేస్తున్నారు. బిజెపి 2018 ఎన్నికలలో కేవలం 1 సీటు మాత్రమే గెల్చుకొని, 8 శాతం ఓట్లు పొందగా, ఈ సారి దాదాపు 14 శాతం ఓట్లను సాధించింది.
 
బిజెపి తన గోషామహల్ స్థానాన్ని నిలుపుకోవడంతో పాటు సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డితో సహా ఏడు కొత్త నియోజకవర్గాలను గెలుచుకుంది. గోషామహల్‌లో టి రాజా సింగ్ 21,457 ఓట్ల ఆధిక్యతతో వరుసగా మూడోసారి గెలుపొందారు. 54.08 శాతం ఓట్ షేర్‌ను పొందారు.
 
సిర్పూర్‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు 3,088 ఓట్లతో విజయం సాధించగా, 34.09 శాతం ఓట్లు సాధించారు. ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ 35.84 శాతం ఓట్లతో 6,692 ఓట్లతో గెలుపొందారు. ముధోల్ స్థానాన్ని రాంరావు పవార్ 23,999 ఓట్లతో (48.59 శాతం ఓట్ షేర్) పార్టీ తరపున గెలుచుకున్నారు.
నిర్మల్‌లో అల్లెటి మహేశ్వర్‌రెడ్డి 50,703 ఓట్ల (54.03 శాతం ఓట్లు) భారీ మెజారిటీతో గెలుపొందగా, పైడి రాకేష్‌రెడ్డి 29,669 ఓట్లతో (44.9 శాతం ఓట్ల షేర్) ఆర్మూరును కైవసం చేసుకున్నారు.
నిజామాబాద్ అర్బన్ స్థానంలో బిజెపికి చెందిన ధన్‌పాల్ సూర్యనారాయణ 15,387 ఓట్ల (40.82 శాతం ఓట్ల షేర్) మెజార్టీతో గెలుపొందారు.  ఈ 8 స్థానాలతో పాటు బోత్, మంచిర్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, దుబ్బాక, గజ్వేల్, కుత్బుల్లాపూర్, లాల్ బహదూర్ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, అంబర్ పేట్, సనత్ నగర్, కార్వాన్, చార్మినార్, సికింద్రాబాద్ సహా 18 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
 
సికింద్రాబాద్ కంటోన్మెంట్, కల్వకుర్తి, వరంగల్ తూర్పు. ఖానాపూర్, బోధన్, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల్, వేములవాడ, మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, ముషీరాబాద్, మలక్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మక్తల్, సూర్యాపేట, పరకాల, వరంగల్ వెస్ట్ లతో  పాటు మరో 19 స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్‌ను కాపాడుకోవడంలో విజయం సాధించింది.
 
గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో బిజెపి ఒక సీటు మాత్రమే (గోషామహల్) గెలుచుకున్నప్పటికీ దాదాపు అన్ని నియోజకవర్గాలలో బలమైన పోటీ ఇచ్చిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడి చేస్తున్నాయి. బలమైన బిజెపి అభ్యర్థులు పోటీలో ఉండటం కారణంగానే కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. బిజెపి మద్దతుతో కూకటపపల్లి నుండి పోటీచేసిన జనసేన అభ్యర్థిముమ్మారెడ్డి ప్రేమ కుమార్‌కు సహితం 39,830 (15.88 శాతం) ఓట్లు లభించాయి. 
 
బీజేపీ ‘జెయింట్ కిల్లర్’ కేవిఆర్
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఇద్దరు బలమైన అభ్యర్థులను ఓడించి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి (కేవిఆర్‌) ‘జెయింట్‌ కిల్లర్‌’ అని నిరూపించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కేవీఆర్ 6,741 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ప్రక్రియలో తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
 
కేవిఆర్‌కు 66,652 ఓట్లు (34.55 శాతం), కేసీఆర్‌కు 59,911 ఓట్లు (31.06 శాతం) వచ్చాయి. రేవంత్ 54,916 ఓట్లు (28.47 శాతం) సాధించారు. ఈటల రాజేందర్ (గజ్వేల్, హుజూరాబాద్), బండి సంజయ్ కుమార్ (కరీంనగర్), అరవింద్ ధర్మపురి (కోరట్ల), అజ్మీరా ఆత్మారావు నాయక్ (ఆసిఫాబాద్), రమేష్ రాథోడ్ (ఖానాపూర్), సోయం బాపురావు (బోత్), ఎం రఘునందన్ రావు (దుబ్బాక)  మర్రి శశిధర్ రెడ్డి (సనత్ నగర్), గుండె విజయ రామారావు (ఘనపూర్ స్టేషన్), చెన్నమనేని వికాస్ రావు (వేములవాడ), అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ (ములుగ్) సహా పలువురు ప్రముఖ నాయకులు, ఎన్నికల్లో ఓడిపోయారు.
 
2018లో రాష్ట్రంలో బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసి గోషామహల్‌లో 6.98 శాతం ఓట్లతో విజయం సాధించింది. గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్‌పై పార్టీ అభ్యర్థి టి రాజా సింగ్ 17,734 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో బిజెపి 102 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడంతో ఈ సారి కూడా 100కు పైగా స్థానాలలో డిపాజిట్ కోల్పోతుందని బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఎగతాళి చేయడం గమనార్హం. 
 
కానీ 8 స్థానాలను గెలుపొంది, 37 స్థానాలలో డిపాజిట్ పొందగలిగింది. తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను బీజేపీ 19.65 శాతం ఓట్లతో గెలుచుకుంది. నిజామాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
 
2018 అసెంబ్లీ ఎన్నికలలో లభించిన ఫలితాలతో సంబంధం లేకుండా 2019 లోక్ సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన బిజెపి 2024 లోక్ సభ ఎన్నికల్లో సహితం తెలంగాణాలో ప్రధానమైన పోటీదారునిగా నిలబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకనే వచ్చే లోక్ సభ ఎన్నికలను స్వీప్ చేయగలమని భరోసాను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.