అయ్యప్ప స్వామి భక్తులపై లాఠీఛార్జ్

శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు తండోపతండాలు తరలివచ్చారు. శబరికొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. శబరిపీఠం నుంచి మొదలు పెడితే పంబా వరకు క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. 

ప్రతి రోజు దాదాపుగా 80 నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుండడంతో ఇసుక వేసిన రాలనంతగా కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కేరళ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించలేదని అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. కేరళ ప్రభుత్వం 16 వేల మంది పోలీసులు నియమించానని చెబుతున్నప్పటికి ఎక్కడ పోలీసులు కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. 

పంబా నుంచి శబరి 650 మంది పోలీసులు ఉన్నట్టు సమాచారం. పంబా పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 16 నుంచి జనవరి 25 వరకు భక్తులు శబరికి తండోపతండాలుగా తరలివస్తారు.  ఈ రెండు నెలల కేరళ ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్నప్పటి భక్తులకు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదని అయ్యప్పస్వాములు మండిపడుతున్నారు. 

ఆర్‌టిసి బస్సులు లేక భక్తులు ఇబ్బందిపడుతున్నారు. మాలాధారణ వేసుకున్న భక్తుల్లో చిన్నపిల్లలు, వృద్దులు సైతం ఉండటంతో తిండి, తిప్పలు, కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నారు. వారం రోజుల క్రితం ఇదే తరహాలో స్వాములు లక్షలాదిగా తరలిరావడంతో సన్నిదానంలో తొక్కిసలాట జరిగింది. 

పెద్ద సంఖ్యలో వచ్చిన అయ్యప్పలతో సన్నిదానం, పంబానది, మలిక్కాపూరం పూర్తిగా భక్తులతో కిటకిటలాడిపోతోంది  డిసెంబర్ నెలలో మాత్రం భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రద్దీ పెరగడంతో ఈ నెల 13వ తేదీన శబరిమలలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు.  కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించాలని కోరినప్పటికి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతి రోజూ శబరిమల ఆలయం దర్శనం కోసం 60 వేల నుండి లక్షలోపు భక్తులు వస్తున్నారు. నిమిషంలో సుమారు 100మందిని 18మెట్లు ఎక్కించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారంటే ఎంత తొక్కిసలాటగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  అందుకే స్వాములు శబరిమలకు బయల్దేరే భక్తులు అక్కడి పరిస్థితిని తెలుసుకొని బయల్దేరడం మంచిదంటున్నారు.

అయితే తాజాగా కరోనా కొత్త వేరియంట్ కూడా పడగ విప్పడంతో అధికారులు చేతులెత్తేశారు. స్వాములు, భక్తులే స్వియ నియంత్రణ, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే కేరళలో నలుగురు మృతి చెందగా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.