2500కు పైగా లోన్ యాప్స్ తొలగించిన గూగుల్

2500కు పైగా లోన్ యాప్స్ తొలగించిన గూగుల్
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్యలో ఏకంగా 2500కుపైగా ఫ్రాడ్ లోన్ యాప్స్‌ను (మోసపూరిత లోన్ యాప్స్) తొలగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక ఇచ్చిన సమాధానంలో  కేంద్ర ప్రభుత్వం ఈ మోసపూరిత (ఫ్రాడ్) లోన్ యాప్స్ నుంచి జనాల్ని రక్షించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం దీని గురించి ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్ ఎస్ డి సి) సమావేశాల్లో కూడా దీనిపై క్రమంగా చర్చిస్తుండటం సహా సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఫేక్ లోన్ యాప్స్ కారణంగా ఎలాంటి ఆందోళననలకు గురి కావాల్సిన అవసరం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. జనం కూడా వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే చురుగ్గా ఉండాలని,  నిరంతర అప్రమత్తతతో సైబర్ సెక్యూరిటీ సంసిద్ధత కొనసాగించాలని, సమయానుకూలంగా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఉండాలని ఆమె సూచించారు.

ఇంకా గూగుల్ కూడా తన ప్లే స్టోర్‌లో లోన్ లెండింగ్ యాప్స్ అమలుకు సంబంధించి తన విధానాన్ని కూడా అప్‌డేట్ చేసినట్లు నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని.. ఇతర పాలనాపర విధివిధానాలు రూపొందించిందని ఆమె స్పష్టం చేశారు. గూగుల్ ఈ సంవత్సర కాలంలో దాదాపు 3500 నుంచి 4 వేల వరకు లోన్ లెండింగ్ యాప్స్‌పై సమీక్ష నిర్వహించిందని, వాటిల్లో 2500కుపైగా యాప్స్‌ను తొలగించిందని ఆమె వివరించారు.