టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్లను.. నాలుగున్నరేళ్లు పూర్తైనా వాటిని పేదలకు అందజేయలేకపోయారు. దీనిపై రాజకీయంగా, ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ సర్కారులో మాత్రం ఎలాంటి కదలిక రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. క్లుప్తంగా ఏపీ టిడ్కో పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 3.13 లక్షల ఇళ్లను నిర్మిస్తుండగా.. అందులో 81 వేల ఇళ్లు 95 శాతం, 71 వేల ఇళ్లు సుమారు 85 శాతానికి పైగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. అయితే 2019 లో ప్రభుత్వం మారాక.. నేటి పాలకులు మాత్రం టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అడుగుకూడా ముందుకు పడలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే నిర్మాణం ఆగిపోయాయో.. ఆ తర్వాత ఒక్క అంగుళం పని కూడా జరగలేదు. చాలా చోట్ల టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగులు వేసుకోవటం తప్ప.. నిర్మాణ పనుల్ని చేపట్టలేదు.
ఓ వైపు ముఖ్యమంత్రి జగన్.. మరోవైపు మంత్రులు గత నాలుగున్నరేళ్లలో ఈ టిడ్కో ఇళ్ల విషయంలో రకరకాల ప్రకటనలు చేశారు. 2022 మార్చ్ లో ఏకంగా అసెంబ్లీలోనే టిడ్కో ఇళ్లపై సీఎం జగన్ ప్రకటన చేశారు. మరికొన్ని నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇళ్లను అందజేస్తామంటూ స్పష్టం చేశారు. కానీ మాటలు కోటలు దాటతున్నా.. చేతలు మాత్రం అడుగు కూడా కదలలేదన్నట్లు.. పేదల సొంతింటి కల ఇప్పటికీ నెరవేరకుండా పోయింది. అంతేకాదు.. గత సర్కార్ 3.13 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అందులో 51 వేల ఇళ్లను రద్దు చేసి 2.62 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ప్రకటించినంత మేరకు పూర్తిచేశారా అంటే.. అదీ లేదు. పేదల ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం కాస్త దృష్టిపెట్టి ఉంటే ఏనాడో ఆ ఇళ్లల్లో పేదలు గృహప్రవేశం చేసేవారని.. కానీ ఈ విషయంలో నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా టిడ్కో కార్పొరేషన్ కే అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే.. ఈ నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం కోసం 9 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో ఏపీ ప్రభుత్వం వాటా కేవలం 1,500 కోట్లు మాత్రమే. దీంతో కాంట్రాక్టర్లకు సకాలంలో ఇవ్వాల్సిన సొమ్ములు అందకపోవడంతో.. ప్రస్తుతానికి పనులు నిలిపేశారు. ఇటు బ్యాంకులు కూడా రుణాల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని పేదలకు అందజేయడం కష్టసాధ్యమే అని చెబుతున్నారు. సొంత గూడు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు ఇప్పటికీ అది కలగానే మిగిలిపోవడం.. అత్యంత దురదృష్టకరం.