విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములపై యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయని, ప్లాంట్ పేరిట బదలాయించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే రాజ్యసభలో సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్‌కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు తెలపాలని విజయసాయి రెడ్డి అనుబంధ ప్రశ్నగా అడిగారు. దీనికి మంత్రి వివరణ ఇస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించిందని, తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగిందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ‘పవర్ ఆఫ్ అటార్నీ’ జారీ చేసిందని, అంతే తప్ప యాజమాన్య హక్కులను బదలాయించలేదని వివరించారు. ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్‌ఐఎన్‌ఎల్‌కు బదిలీ చేసే ప్రతిపాదన కూడా ఏదీ తమ వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.
రౌర్కెలా స్టీల్ ప్లాంట్ మినహా ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)’ దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ల భూములపై సర్వహక్కులు ఆయా ప్లాంట్ల పేరిట దఖలు పడి ఉన్నట్లు ఉక్కు శాఖ మంత్రి తెలిపారు.
భిలాయ్ స్టీల్ ప్లాంట్, బొకారో స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇస్కో స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్ అలాయ్ స్టీల్ ప్లాంట్, విశ్వేశ్వరయ ఐరన్, స్టీల్ ప్లాంట్‌లు నెలకొల్పిన భూములకు ఆయా ప్లాంట్‌లే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయని చెప్పారు. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ భూములు మాత్రం లీజు పద్దతిలో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం