అగమ్య గోచరంగా మేడిగడ్డ బ్యారేజీ ఉనికి!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా రూ 1 లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన మూడేళ్లకే కుంగిపోవడం కలకలం సృష్టించింది. 
 
లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు మూన్నాళ్ల ముచ్చటగా మారిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో భారీగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఒకవంక దర్యాప్తు జరిపించి బాధ్యులను గుర్తించడంతో పాటు, మరమత్తులు చేయించడం కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ పెద్ద సవాల్ గా మారనుంది.
 
అప్పటి వరకు ఉ అంటే కాళేశ్వరం అ అంటే కాళేశ్వరం పేరు ఎత్తే బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రాజెక్టు పేరునే ఎత్తలేదు. ప్రాజెక్టు కుంగిన తర్వాత దాని బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదేనని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేస్తారని ప్రకటించారు.
 
అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది వట్టి మాటేనని ఇప్పుడు అర్థమైంది. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఎల్అండ్ టీ కుండబద్దలు స్పష్టం చేసింది.చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టింది. అందుకు సుమారు రూ 500 కోట్ల వ్యయం కాగలదని చెబుతున్నారు. 
 
ఇప్పటికే కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారింది. ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లుల రూపంలో సంవత్సరానికి వందల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు రిపేర్ ఖర్చులు కూడా చెల్లించాలంటే ప్రాజెక్ట్ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.  డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఐదేండ్లు కాదని, రెండేండ్లేనని ఎల్ అండ్ టీ పేర్కొంది.
ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే స్పష్టం చేసింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లేఖ రాసింది. ఈ ఏడాది అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసుల ఫిర్యాదు చేశారు. సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తర్వాత స్పష్టమైంది. 
 
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టక పోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. అయితే పలు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు సహితం ఈ సందర్భంగా తలెత్తే అవకాశాలున్నాయి.
 
ఇలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందర్ని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పర్యటనకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎందుకు కుంగిపోయింది, ఏం జరిగిందనే దాని గురించి తెలుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. 
 
కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు..? వారి వెనుక ఉన్నవారెవరు..? ఎవరు? కాంట్రాక్టులు చేసిన తప్పులెంటి..? వంటి అంశాలను నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అయితే, నిపుణుల కమిటీ ద్వారా జరిగిన లోపాలను కనుగొనే ప్రయత్నం చేయాలి గాని ఎమ్యెల్యేలను తీసుకెళ్లేందుకు పర్యాటక యాత్రనా? అంటూ బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత ముఖ్యమంత్రి ప్రకటనను ఎద్దేవా చేశారు.