‘వీక్షిత్ భారత్ సంకల్ప’ యాత్రను ప్రారంభించిన తమిళిసై

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రంగారెడి, మేడ్చల్‌ జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా యాత్రను ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందర్‌రాజన్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచారరథాన్ని శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అట్టడుగువర్గాల వారి చేరాలన్నదే వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రధాన లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ యాత్ర ద్వారా ప్రథకాలపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 వరకు జిల్లాలో ఈ యాత్రను కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. 

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఆహార, బ్యాంకుల రుణ పథకాల ఎగ్జిబిషన్‌ స్టాల్‌ను గవర్నర్‌, కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి తిలకించారు. రాష్ట్ర ప్రిబబు అధికారి రాష్ట్ర అదనపు కార్యదర్శి శాంతమను, కలెక్టర్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ రఘుప్రసాద్‌, రాష్ట్ర రెడ్‌ క్రాస్‌ కన్వీనర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ  తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను భారతదేశ ప్రజలందరికీ తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించడం జరుగుతుందని గవర్నర్ చెప్పారు.  దేశం అంతటా మూడు వేల రథాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి నరేంద్ర మోదీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించారని వెల్లడించారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్ వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యాత్ర వాహనాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ  కేంద్రం అమలు చేస్తున్న పథకాలు అర్హత కలిగిన లబ్ధిదారులు వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.