పోలీస్ కస్టడీకి పార్లమెంట్ వద్ద దాడికి పాల్పడిన నలుగురు

 * మొబైల్ ఫోనులు ధ్వంసంచేసి లొంగిపోయిన ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త ల‌లిత్ ఝా!

పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట క‌ల‌ర్ స్మోక్ దాడికి పాల్ప‌డ్డ న‌లుగురు నిందితుల‌కు ఏడు రోజుల పాటు పోలీసు క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో సాగ‌ర్ శ‌ర్మ‌, మ‌నోరంజ‌న్, నీలం దేవి, అమోల్ షిండేను పోలీసులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకొని మ‌రింత లోతుగా విచారించ‌నున్నారు. నిందితుల‌ను పోలీసులు గురువారం కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు.

రిమాండ్‌కు త‌ర‌లించ‌కుండా త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న ఉగ్ర‌దాడిని పోలి ఉంద‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్ర‌మంలో వారిని మ‌రింత లోతుగా విచారించాలని, వారి వెనుకాల ఏదైనా ఉగ్ర‌వాద సంస్థ ప్రమేయం ఉందా? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు. దీంతో నిందితుల‌కు కోర్టు ఏడు రోజుల పాటు పోలీసు క‌స్ట‌డీ విధించింది.

అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉంద‌ని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. ల‌లిత్ ఝా అనే వ్య‌క్తిఈ దాడి ప్ర‌ధాన వ్యూహ‌క‌ర్త ల‌లిత్ ఝా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ల‌లిత్ చివ‌రిసారిగా ఢిల్లీకి 125 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నీమ్రానాలో క‌నిపించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిరుద్యోగం, రైతుల స‌మ‌స్య‌లు, మ‌ణిపూర్ హింస వంటి అంశాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ పార్ల‌మెంట్‌పై దాడి చేయాల‌ని ల‌లిత్ ఝా నేతృత్వంలోనే కుట్ర జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. 22 ఏండ్ల క్రితం డిసెంబ‌ర్ 13వ తేదీనే ఉగ్ర‌వాదులు పార్ల‌మెంట్‌పై దాడి చేసి 9 మందిని పొట్ట‌న పెట్టుకున్న రోజునే ఈ క‌ల‌ర్ స్మోక్ దాడి చేయాల‌ని ల‌లిత్ నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. 

ల‌లిత్ సూచ‌న‌ల మేర‌కు మిగ‌తా ఐదుగురు విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కోల్‌క‌తా చెందిన ల‌లిత్ వృత్తిరీత్యా టీచ‌ర్. భ‌గ‌త్ సింగ్‌నుఆద‌ర్శంగా తీసుకున్న ల‌లిత్ తాను దేశం దృష్టిని ఆక‌ర్షించాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ కుట్ర‌కు ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్లు తెలిసింది.  ల‌లిత్ ఝా బుధవారం ఉద‌యం సాగ‌ర్ శ‌ర్మ‌, మ‌నోరంజ‌న్, అమోల్ షిండే, విక్కీ శ‌ర్మ‌ను గురుగ్రామ్‌కు పిలిపించుకుని మాట్లాడారు. అనంత‌రం దాడికి పాల్ప‌డ్డారు.

ఇలా ఉండగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఆధారాల‌ను మాయం చేసేందుకే ల‌లిత్ ఆ నలుగురి మొబైల్ ఫోనులను ధ్వంసం చేసిన్నట్లు వెల్లడైంది.  పార్ల‌మెంట్ బ‌య‌ట క‌ల‌ర్ స్మోక్ వ‌దిలిన దృశ్యాల‌ను ల‌లిత్ మొబైల్‌లో చిత్రీక‌రించి, కోల్‌క‌తాకు చెందిఓ ఎన్జీవో గ్రూప్‌లో షేర్ చేసాడు. ఆ త‌ర్వాత వీడియో వైర‌ల్ అయింది. 
 అనంత‌రం పార్ల‌మెంట్ ప‌రిస‌రాల నుంచి ల‌లిత్ పారిపోయారు. 48 గంట‌ల త‌ర్వాత ఢిల్లీకి తిరిగొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఢిల్లీ నుంచి రాజ‌స్థాన్ వెళ్లి, అక్క‌డ ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఉన్న‌ట్లు ల‌లిత్ తెలిపాడు. రెండు రోజుల అనంత‌రం మ‌హేశ్ అనే వ్య‌క్తితో క‌లిసి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నాడు లలిత్.ప్ర‌స్తుతం ల‌లిత్ ఝా ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. అత‌న్ని విచారిస్తున్నారు పోలీసులు. మొబైల్స్‌ను కాల్చి వేసిన‌ట్లు పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ల‌ను ప‌రిశీలిస్తే కానీ దాడికి గ‌ల కార‌ణాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఇక సాగ‌ర్, అమోల్, నీలం, మ‌నోరంజ‌న్‌ను పోలీసులు ఏడు రోజుల పాటు త‌మ క‌స్ట‌డీలో ఉంచుకోనున్నారు.