భద్రతా ఉల్లంఘన ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్‌

* 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌

లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ ఘటన నేపథ్యంలో గురువారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎగువ, దిగువ సభల్లో ఈ అంశంపై సభ్యుల నిరసన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
 
బుధవారం జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్ష ఎంపీలు ఉదయం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. సభలో జరిగిన కలర్‌ స్మోక్‌ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.   పార్లమెంట్ లో అనుచితంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. వారిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.
 
ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడ్డారు. విపక్ష ఎంపీల ఆందోళనలతో ఎగువ, దిగువ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగువ సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు ఎగువ సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు కలర్‌ స్మోక్‌ ఘటనపై ఆందోళనకు దిగారు. హోం మంత్రి అమిత్‌ షా సభకు రావాలని,ఘటనపై మాట్లాడాలంటూ పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక ప్రతిపక్ష నేతలు తన చాంబర్‌లో సమావేశం కావాలని చైర్మన్‌ కోరారు.
 
సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారన్న కారణంతో 14 మంది విపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్సెండ్‌ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, డీఎంకే ఎంపీ కనిమొళి ఉన్నారు. 
 
వారితోపాటు టీఎన్‌ ప్రతాపన్‌, హిబీ ఈడెన్‌, జోతిమణి, రమ్య హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ కుర్యాకుల, బెన్సీ బెహనన్‌, వీకే శ్రీకందన్‌, మహ్మద్‌ జావేద్‌, పీఆర్‌ నటరాజన్‌, కె సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, ఎన్‌ వెంకటేశన్‌ తదితరులను మిగిలిన సెషన్స్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సభలో తీర్మానించారు.మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. స్మోక్ అటాక్ ఘ‌ట‌న‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న స‌మ‌యంలో చైర్మెన్ జ‌గ‌దీప్‌ తో ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిల‌బ‌డి చేతులు ఊపారు. దీంతో చైర్మన్‌ ఒబ్రెయిన్ ప్రవ‌ర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు ఒబ్రెయిన్ పాల్పడిన‌ట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.